సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా కూన వెంకటేష్‌గౌడ్‌?

సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా కూన వెంకటేష్‌గౌడ్‌?

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో తెలంగాణలోని అన్ని పార్లమెంటు స్థానాల పోరుకు టీడీపీ సిద్ధమవుతోంది. రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు కూన వెంకటేశ్ గౌడ్‌ను సికింద్రాబాద్ నుంచి బరిలోకి దించాలని టీడీపీ నిర్ణయించినట్టు సమాచారం తెలుస్తోంది. మంగళవారం బేగంపేటలోని కూన వెంకటేశ్ గౌడ్‌ నివాసంలో నగర అధ్యక్షుడు ఎంఎన్‌ శ్రీనివాస్‌, సారంగపాణి, బీఎన్‌రెడ్డి, భజరంగ్‌శర్మ, వనం రమేష్‌‌లు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎవరు పోటీ చేయాలనే విషయంపై తీవ్ర చర్చ జరిగింది. చివరకు కూన వెంకటేశ్ గౌడ్‌ను నిలపాలని మెజారిటీ నేతలు ప్రతిపాదించారు. ఎందుకంటే సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో టీడీపీకి భారీగా ఓట్లు పడే అవకాశం ఉంది. మరోవైపు బీసీల ఓట్లతో పాటు గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా చాలానే పడే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. అయితే బుధవారం అమరావతిలో జరిగే టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌రెడ్డి సైతం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎవరికీ అవకాశం దక్కుతుందో చూడాలి.