బోటులో వెళ్లింది 73 మంది కాదు...లెక్క చెప్పిన మంత్రి

బోటులో వెళ్లింది 73 మంది కాదు...లెక్క చెప్పిన మంత్రి

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో అసలు పడవలో ఎంత మంది ఉన్నారనే విషయం మీద రకరకాల చర్చలు జతుగుతున్నాయి. ప్రమాదం సమయంలో బోటులో 73 కాదు 93మంది ప్రయాణికులు ఉన్నారని.. బోటులో ప్రయాణికుల సంఖ్యను అధికారులు తప్పు చెబుతున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని.. దేవీపట్నం ఎస్సై బోటుకు అనుమతి ఇవ్వలేదని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రమాద సమయంలో ఆ బోటులో ఉన్నది 73 మంది కాదని, 77 మంది అని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

మునిగిన బోటులో అసలు ఎంతమంది ఉన్నారనే అంశంపై ఎవరికీ క్లారిటీలేదు. 73 మంది ఉండొచ్చని తొలుత భావించారు. ఈ క్రమంలో సాక్షాత్తూ మంత్రి క్లారిటీ ఇచ్చారు. బోటులో మొత్తం 77 మంది ఉన్నారని చెప్పారు. ఇంకా 16 మృతదేహాలు ఇంకా దొరకాల్సి ఉందని అన్నారు.  ఆచూకీ తెలియాల్సిన వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 9 మందికాగా.. మరో ఏడుగురు తెలంగాణ వారని అన్నారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గోదావరిలో మునిగిన బోటు 250 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారని, దాని కింద మిగిలిన మృతదేహాలు ఉండొచ్చని భావిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.