క్యాచ్‌ పట్టబోయి...

క్యాచ్‌ పట్టబోయి...

శ్రీలంక క్రికెట్‌ జట్టుకు సీనియర్ ఆటగాళ్లు సంగక్కర, జయవర్ధనే, దిల్షాన్ వంటి స్టార్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ జట్టుకు మొదలైన కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. సీనియర్ల నిష్క్రమణతో జట్టు మొత్తం కుర్రాళ్లతో నిండినా.. జట్టు మాత్రం అడపాదడపా ప్రదర్శనలు మాత్రమే చేస్తుంది. ఈ సమయంలో లంక జట్టు కెప్టెన్ దినేష్ చండీమాల్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో వెస్టిండీస్‌, శ్రీలంక మధ్య జరుగుతోన్న చివరి టెస్టుకు దూరమయ్యాడు. తాజాగా మరో ఆటగాడు కూడా మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి.

శ్రీలంక, వెస్టిండీస్‌ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు జరుగుతోంది. చివరి టెస్టు మూడో రోజున శ్రీలంక ఆటగాడు కుశాల్‌ పెరీరా క్యాచ్‌ పట్టబోయి గాయపడ్డాడు. మూడో రోజున లంక బౌలర్ దిల్రువన్‌ పెరీరా వేసిన బంతిని వెస్టిండీస్‌ ఆటగాడు గాబ్రియల్‌ బలంగా కొట్టాడు. ఆ బంతి కాస్తా బౌండరీ లైన్‌ దాటి సిక్స్‌ వెళ్తుండగా.. బౌండరీ లైన్‌ వద్దే ఫీల్డింగ్‌ చేస్తున్న కుశాల్‌ ఆ బంతిని గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకోబోయాడు. ఈ క్రమంలో కుశాల్‌ బౌండరీ లైన్‌ వద్ద ఉన్న ప్రకటనల బోర్డును బలంగా తాకి బోర్లా పడ్డాడు. దీంతో అతడు కొంతసమయం వరకు ఇబ్బందిపడ్డాడు. జట్టు సిబ్బంది కుషాల్ పెరీరాను ఆస్పత్రికి తరలించారు. 'కుషాల్  కోలుకుంటున్నాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. నాలుగో రోజు కుషాల్ సేవలు అవసరం అయితేనే బ్యాటింగ్‌ చేస్తాడు' అని లంక క్రికెట్‌ బోర్డు తెలిపింది.