కేసీఆర్... ఓ నయా నవాబ్..

కేసీఆర్... ఓ నయా నవాబ్..

టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్బూ... కేసీఆర్ ఓ నయా నవాబ్ అని మండిపడ్డ ఆమె... తిరిగే కార్లు... ఉండేందుకు వందలకోట్ల బంగ్లాతో కేసీఆర్ నవాబ్ ను తలపిస్తున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ సీఎం కాదు... కమిషన్ మ్యాన్ అని... కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ జీరో కావడం ఖాయమని జోస్యం చెప్పి ఖుష్బూ... తెలంగాణలో అధర్మ పాలన సాగిందన్నారు. మావోయిస్టుల పట్ల ప్రభుత్వం తీరు బాగోలేదన్న ఆమె... ఫేక్ ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు. చిత్రహింసలు, యాసిడ్ లు పోసి చంపేసిన శృతి ఎన్‌కౌంటర్ పై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 

టీఆర్ఎస్‌ - బీజేపీలు రెండు ప్రేమలో ఉన్నాయని ఎద్దేవా చేసిన ఖుష్బూ... కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ లను కూడా మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అన్న ఆమె... కాంగ్రెస్ 11 మంది మహిళలకు టికెట్ ఇస్తే.. టీఆర్‌ఎస్‌ ఇచ్చింది ముగ్గురికే అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళా వ్యతిరేక సర్కార్ అన్న ఆమె... బతుకమ్మ చీరల కొనుగోళ్లలో రూ.220 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మహిళలు అంటే రాష్ట్రంలో కేసీఆర్  కూతురు ఒక్కరేనా .? అని ప్రశ్నించిన ఖుష్బూ... స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా మహిళను పెట్టలేని దౌర్భాగ్యపు  ప్రభుతం కేసీఆర్ ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.