కైలీ.. ద కాస్మటిక్‌ క్వీన్‌

కైలీ.. ద కాస్మటిక్‌ క్వీన్‌

ఆమె వయసు జస్ట్ 20 ఏళ్లు. కానీ సంపాదనలో మహా మహా మిలీనియర్లతో పోటీ పడుతోంది. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు కాదు. స్వయంకృషితో ఏడాదికి దాదాపు బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్‌లిస్ట్‌లో స్వయంకృషితో ఎదిగిన అత్యంత విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తగా మేగజైన్ కవర్ పైకి ఎక్కి కుబేరులకే దిమ్మతిరిగే షాకిచ్చింది. వ్యాపారంలో ఎగుడుదిగుడులు సహజం అని కొమ్ములు తిరిగిన వ్యాపారవేత్తలు చెబుతుంటారు. కానీ కైలీ రూటే సెపరేటు. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాపారం పెరగడమే తప్ప తగ్గడం ఎరుగని వ్యాపార దిగ్గజం. మొదటి ఏడాదిలో కొద్ది నెలల్లోనే 600 మిలియన్ డాలర్లకు పైగా వ్యాపారం చేసింది. ఇప్పుడు ఆమె వార్షికాదాయం టాక్స్‌ మినహాయింపులు పోనూ సుమారు 900 మిలియన్‌ డాలర్లపైనే అంటే మన కరెన్సీలో రూ.6,210 కోట్లకు మాటే.

కైలీ జెన్నర్ మోడల్ గా, టీవీ స్టార్ గా అమెరికాలో ఎంతో పాపులర్. టీవీ షోలు, సినిమాలు, ఫ్యాషన్ షోలతో కైలీ యమా బిజీగా ఉంటుంది. ప్రముఖ మోడల్, నటి కిమ్  కర్దాషియన్‌కు కైలీ చెల్లెలు. దీంతో కైలీ జెన్నర్ కి సోషల్ మీడియాలో కోట్లాదిగా ఫాలోయర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అత్యధికంగా ఆర్జిస్తోన్న వారి జాబితాలో అత్యధికంగా ఆర్జించి తొలి స్థానం దక్కించుకుంది కైలీ‌. ఆమె ఒక్క వాణిజ్య ప్రకటన పోస్ట్‌కు ఏకంగా 1 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు(రూ.6,85,42,000 ) ఆర్జిస్తోంది. ఆమె సోషల్‌ మీడియా దిగ్గజం స్నాప్‌ చాట్‌ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన ఒక్క ట్వీట్‌ తో ఆ సంస్థ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.1.3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7వేల కోట్లకు పైగా) నష్టపోవాల్సి వచ్చిందంటే కైలీకి ఉన్న క్రేజేంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఇన్ స్టాగ్రామ్ లోనే కైలీ జెన్నర్ కి 111.1 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యాపిల్ ఐట్యూన్స్ యాప్ స్టోర్ లో కైలీ సొంత యాప్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

అసలే సోషల్ మీడియా సెన్సేషన్. ఆపై ఫ్యాషన్ ఐకాన్ కిమ్ కర్దాషియన్ చెల్లెలు. దీంతో కైలీ ఏం చేస్తే అదే ఫ్యాషన్ ట్రెండ్‌. యువత బ్లైండ్‌గా ఆమె స్టైల్‌ను ఫాలో అయిపోతుంటారు. ఇంత పాపులారిటీ ఉన్న కైలీ రెండేళ్ల కింద తన పేరు మీదే కైలీ కాస్మొటిక్స్ అనే ఓ సంస్థను ప్రారంభించింది. మొదట ‘100 పర్సంట్‌’ పేరిట లిప్ లైనర్, లిప్ స్టిక్ కలిపిన లిప్ కిట్స్ ను 29 డాలర్లకు అమ్మడం ప్రారంభించింది. అంతే..అప్పటి నుంచి కైలీ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. యువత నాడిని ఎప్పటికప్పుడు పట్టుకుంటూ వారి అభిరుచులే పెట్టుబడిగా జెన్నర్ ఆ తర్వాత ఐ షాడో, హైలైటర్, ఐ లైనర్, ఇతర మేకప్ సామాగ్రి తయారీలోకి వ్యాపారాన్ని విస్తరించింది. లిమిటెడ్ ఎడిషన్ ఉత్పత్తి ‘డ్రాప్స్‘కి నవంబర్ 2016లో జరిపిన ఫ్లాష్ సేల్స్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. 24 గంటల్లో ఈ హాలీడే కలెక్షన్ దాదాపుగా 19 మిలియన్ డాలర్లు ఆర్జించింది. ఫిబ్రవరి 2016లో వ్యాపారం ప్రారంభించిన కైలీ జెన్నర్ ఇప్పటి వరకు సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిపింది.

ఇంత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు జెన్నర్ తన కుటుంబం నుంచి ఏ సాయం తీసుకోలేదు. కైలీ కాస్మొటిక్స్ కి నూటికి నూరు శాతం యజమాని జెన్నరే. సొంతకాళ్లపై నిలబడి ఫ్యాషన్, కాస్మెటిక్స్ రంగంలో దూసుకెళ్తున్న కైలీ జెన్నర్ జోరుపై ఫోర్బ్స్ మేగజైన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బిజినెస్‌లో దూసుకెళ్తున్న కైలీకి ఫోర్బ్స్ పత్రిక యంగెస్ట్‌ సెల్ఫ్‌ మేడ్‌ యూఎస్‌ బిలినియర్‌ కితాబునిచ్చింది. గతంలో ఫేస్‌బుక్‌ యాజమాని మార్క్‌ జుకర్‌బర్గ్‌ (23 ఏళ్లు) పేరిట ఈ రికార్డు ఉండేది. పాప్ స్టార్ ట్రావిస్‌ స్కాట్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న కైలీ జెన్నర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టార్మీ వెబ్ స్టర్ అనే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

(Photos/twitter.com/KylieKJBrasil)