నా విశ్వసనీయత కు ఇది తుది పరీక్షః లగడపాటి

నా విశ్వసనీయత కు ఇది తుది పరీక్షః లగడపాటి

కచ్చితమైన మెజార్టీతోనే ఏపీలో ప్రభుత్వం ఏర్పడుతుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం లేదని, నా విశ్వసనీయతకు ఇది తుది పరీక్ష అని తెలిపారు. ఎన్నికల ఫలితాల సరళిపై ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా కేంద్రంతోనూ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉన్నందున ఫలితాలు ఎలా వస్తాయోనని ఉత్కంఠతో ఉన్నారు. నేను విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో అక్కడి ప్రవాసాంధ్రులతోనూ మాట్లాడా. వారు కూడా మనకంటే ఎక్కువ ఆసక్తితో రాష్ట్రంలోని ఫలితాలపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రాజధాని నిర్మాణం, ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు.. కేంద్రం, రాష్ట్ర సహకారంతోనే సాధ్యమన్న ప్రత్యేక దృష్టితో ప్రజలు ఈ ఎన్నికల్ని చూస్తున్నారు. ఏపీ ప్రజలు కోరుకోకుండానే రాష్ట్రం ఏర్పడింది.. రాజధాని, నిధులు లేవు. ఆనాడు పాండవులు ఖాండవ వనాన్ని ఇంద్రప్రస్థగా మార్చుకున్నారు. అలనాటి మయ సభలాంటి అసెంబ్లీ భవనం అమరావతిలో రాబోతోంది. అందరూ అసూయపడేలా మన రాజధాని అభివృద్ధిలోకి వస్తుంది. మన రాజధాని కోసం రైతులు త్యాగం చేశారు. ప్రతి ఒక్కరూ రాజధానిపై ఆసక్తితో చూస్తున్నారు.