ఈ సారి నా సర్వే తప్పితే..!

ఈ సారి నా సర్వే తప్పితే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన సర్వే ఫలితాలకు భిన్నంగా ఫలితాలు రావడంతో.. ఆయన సర్వేలకు విశ్వసనీయత లేకుండా పోయిందని విశ్లేషకులు కామెంట్లు చేశారు. అయితే, అయితే తాజాగా ఏపీ ఎన్నికలపై సర్వే ఫలితాలను వెల్లడించిన లగడపాటి... ఏపీలో తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చితీరుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీ ఎన్నికల్లో మీ సర్వే ప్లాప్ అయితే పరిస్థితేంటి? అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి సమాధానమిచ్చిన ఆంధ్రా ఆక్టోపస్.. ఈ సారి నా సర్వే అంచనాలు తప్పితే మళ్లీ సర్వే చేసి చెప్పను. ఈ నెల 23 తర్వాత నా విశ్వసనీయత పెరుగుతుంది. నా సర్వేను నమ్మాలని నేను ఎవరినీ కోరడంలేదు. బల్లగుద్ది అస్సలే చెప్పట్లేదు. కత్తిపెట్టి ఇది వినండని నేనేం అనలేదు. వినేవాళ్లు వింటారు. నమ్మేవాళ్లు నమ్ముతారని వ్యాఖ్యానించారు. ఇక నాకు అటు ఏపీ.. ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీతో సంబంధంలేదు. నా రాజకీయ ప్రయాణం కాంగ్రెస్‌తోనే మొదలైందన్న విషయం అందరికీ తెలుసు. అదే కాంగ్రెస్ పార్టీనే నా రాజకీయ జీవితం అంతమైంది. నాకు ఏ పార్టీ ఎక్కువ కాదు.. ఏ పార్టీ తక్కువ కాదు.. అన్ని పార్టీలూ నాకు సమానమే. దయచేసి నన్ను ఏ పార్టీతోనూ ముడిపెట్టొద్దు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు లగడపాటి రాజగోపాల్. అయితే, ఈ సారి తన సర్వే కచ్చితంగా సక్సెస్ అవుతుందని లగడపాటి మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, ఏపీలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం దక్కించుకుంటుందని తన సర్వేలో తేలిందని లగడపాటి ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీకి 90 నుంచి 110, వైసీపీ 65 నుంచి 79, ఇతరులు 3 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటాయని తెలిపారు. పార్లమెంట్ స్ధానాల విషయానికి వస్తే.. టీడీపీ 13 నుంచి 17, వైసీపీ 8 నుంచి 12, ఇతరులు ఒక స్ధానం రావొచ్చని అన్నారు. అసెంబ్లీలో వివిధ పార్టీల ఓటింగ్ శాతం.. టీడీపీ 43 నుంచి 45 శాతం, వైసీపీ 40 నుంచి 42 శాతం, జనసేన 10 నుంచి 12 శాతంగా ఉంటుందని అన్నారు. పార్లమెంట్ లో టీడీపీ 43 నుంచి 45, వైసీపీ 40.5 నుంచి 42.5, జనసేన 10 నుంచి 12 శాతం ఓటింగ్ శాతం ఉంటుందని సర్వేలో తేలిందని లగడపాటి తెలిపారు.