'చక్రం కాదు.. బొంగరం కూడా తిప్పలేరు..'

'చక్రం కాదు.. బొంగరం కూడా తిప్పలేరు..'

ఢిల్లీని శాసిస్తామంటూ టీఆర్‌ఎస్‌ పగటి కలలు కంటోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. కన్న తల్లికి అన్నం పెట్టని వారు పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా నన్నట్టు ఉంది ఆ పార్టీ పరిస్థితి అని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ మళ్లీ ప్రధానైతే రాజకీయ సన్యాసానికి కేటీఆర్‌ సిద్ధమా? అని ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణలో ఒక్క ఎంపీ ఉంటేనే అనేక ప్రాజెక్టులు తెచ్చామని.. ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉందన్నారు.

'యువరాజుకి పట్టాభిషేకం చేసి ఢిల్లీ బాట పట్టాలని కేసీఆర్ అనుకుంటున్నారు. మీ వల్ల తెలంగాణ రాలేదు. ఢిల్లీలో మీరు చక్రం కాదు కదా బొంగరం కూడా తిప్పలేరు.' అని అన్నారు. 'మీ ఫెడరల్ ఫ్రంట్ ఎటు పోయింది? ఎన్ని పార్టీ లు వచ్చాయి?' అని ప్రశ్నించారు లక్ష్మణ్‌. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్టేనని.. అసదుద్దీన్‌ దళారి పాత్రను పోషిస్తున్నారని.. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌కి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.