'మోడీలంతా దొంగలు' వ్యాఖ్యపై రాహుల్ గాంధీపై కేసు పెడతా

'మోడీలంతా దొంగలు' వ్యాఖ్యపై రాహుల్ గాంధీపై కేసు పెడతా

'మోడీ ఇంటి పేరున్న వాళ్లంతా దొంగలు' అని వ్యాఖ్యానించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కోర్టులో కేసు వేస్తానని  ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ ప్రకటించారు. 'ఈ పప్పు రాహుల్ గాంధీ మోడీలంతా దొంగలు అంటున్నారు. అతనిపై యుకె కోర్టులో నేను కేసు వేయబోతున్నాను. కానీ 5 దశాబ్దాలుగా ఎవరు పట్టపగలే భారత్ ను దోచేస్తున్నారనే వాస్తవం ప్రపంచానికంతా తెలుసు. అదెవరో కాదు సాక్షాత్తు గాంధీ కుటుంబమే' అని లలిత్ మోడీ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్లతో వీడియోలని కూడా లలిత్ మోడీ అటాచ్ చేశారు. ఆ వీడియోలలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పరిపాలన కాలంలో, ఆ తర్వాత యుపిఏ హయాంలో జరిగిన అవినీతి, పలు కుంభకోణాలను ప్రస్తావించారు. గాంధీ అనే పేరున్నంత మాత్రాన ఈ కుటుంబంలో అంతా మహాత్ములు అయిపోయారా? అని లలిత్ మోడీ ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. 'నేనో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎందుకు దొంగలందరికీ ఇంటిపేరు మోడీ అనే ఉంటుంది? నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ? ఇంకా ఎంత మంది ఇలాంటి మోడీలు బయటికి వస్తారోనని' రాహుల్ వ్యాఖ్యానించారు.

మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీ అప్పగింత కోసం భారత దర్యాప్తు సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. లలిత్ మోడీ 2010లో దేశం వదిలి పారిపోయాడు. 

అంతకు ముందు బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు.