ఎన్డీఏకు రాంరాం..? మహాకూటమిలోకి నితీష్‌..?!

ఎన్డీఏకు రాంరాం..? మహాకూటమిలోకి నితీష్‌..?!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.. ఎప్పుడు ఎవరైనా? ఏ గూటిలోనైనా? ప్రత్యక్షం కావొచ్చు.. స్నేహితులు.. శత్రువులు కావొచ్చు..! బద్ద శత్రువులు.. స్నేహితులుగా మారొచ్చు. గత ఎన్నికల్లో బిహార్‌లో కలిసిన పనిచేసిన ఆర్జేడీ-జేడీయూ అధికారంలోకి వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. కొంతకాలం వీరి బంధం సవ్యంగా సాగినా.. అనంతరం జేడీయూతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్న బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌.. అయితే, ఆయన మళ్లీ ఇప్పుడు ఆర్జేడీతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నం చేశారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పేర్కొన్నారు. త్వరలో విడుదల కానున్న తన పుస్తకం ‘‘ఫ్రం గోపాల్‌గంజ్‌ టు రైజీనా’’లో లాలూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తన పుస్తకంలో లాలూ ఇలా ప్రస్తావించారు.. ‘‘బీజేపీతో జేడీయూ పొత్తును వదులుకుని మహాఘట్‌బంధన్‌లో చేరితే, నా పార్టీ నితీష్‌కు మద్దతిస్తుందా అన్న ప్రశ్నను కిశోర్‌ అత్యంత సున్నితంగా, సూచనప్రాయంగా నాతో ప్రస్తావించారు. నాకు నితీష్‌తో విభేదాలేవీ లేనప్పటికీ.. ఆయనపై ఉన్న విశ్వాసం పూర్తిగా పోయింది. పైపెచ్చు.. 2015లో బీజేపీకి వ్యతిరేకంగా మా కూటమికి ఓటేసిన ప్రజలు ఇప్పుడు బీజేపీతో ఉన్న నితీష్‌ను మళ్లీ స్వాగతిస్తే అంగీకరించరేమోనన్న మీమాంస కూడా నాలో ఉంది’’ అంటూ అంటూ పేర్కొన్నారు లాలూప్రసాద్ యాదవ్. ఇప్పుడు లాలూ వ్యాఖ్యలు హాట్ టాఫిక్ అయ్యాయి. అయితే, లాలూ వ్యాఖ్యలను జేడీయూ ఖండించింది. 2017లోనే మహాకూటమితో బంధం తెగిపోయింది.. మరోసారి వారితో కలిసి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు జేడీయూ సెక్రటరీ జనరల్‌ కేసీ త్యాగి. ఈ విషయంపై తానెప్పుడూ లాలూను కలవలేదని జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.