బీహార్ లో పొడిచిన ఆర్జేడీ-కాంగ్రెస్ పొత్తు

బీహార్ లో పొడిచిన ఆర్జేడీ-కాంగ్రెస్ పొత్తు

వచ్చే నెల జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో లాలూ యాదవ్ ఆర్జేడీ బీహార్ లోని 40 సీట్లలో సగం వాటికి పోటీ చేస్తుంది. మిగతా స్థానాలను మిగిలిన నాలుగు భాగస్వామ్య పక్షాలు పంచుకుంటాయి. మహాకూటమి సీట్ల పంపకాలను శుక్రవారం ప్రకటించారు. కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేస్తుంది. 

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ..జనతాదళ్ యునైటెడ్(జేడీయు) మాజీ నేత శరద్ యాదవ్ ఆర్జేడీ గుర్తుపై పోటీ చేస్తారు. ఎన్నికల తర్వాత తన కొత్త పార్టీ లోక్ తాంత్రిక్ జనతా దళ్ ను ఆర్జేడీలో విలీనం చేస్తారు.

బీజేపీ మాజీ భాగస్వామి, డిసెంబర్ లో విడిపోయిన ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ఐదు సీట్లలో, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) మూడు సీట్లలో పోటీ చేస్తాయి. మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం)కి మూడు సీట్లు ఇచ్చారు.

ఈ సీట్ల పంపకాలు చూస్తుంటే ఈ కూటమిని ఏకం చేయడం వెనుక లాలూ యాదవ్ పాత్ర ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తోంది. భాగస్వాములకు ఎక్కువ సీట్లు ఇచ్చి ఆర్జేడీ తమ సంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంకుతో పాటు ఇతర కులాల సహకారం లేనిదే తాము బీహార్ లో ఎన్డీఏని ఢీ కొట్టడం కష్టమని గుర్తించినట్టు కనిపిస్తోంది.

అధికార జేడీయు, బీజేపీ తమ సీట్ల పంపకాన్ని డిసెంబర్ లోనే ముగించాయి. రెండు పార్టీలు చెరో 17 సీట్లలో పోటీ చేస్తాయి. మిగిలిన 6 సీట్లలో రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ బరిలోకి దిగుతుంది.