ఉజ్జయినీ ఆలయంకు బెదిరింపులు...

ఉజ్జయినీ ఆలయంకు బెదిరింపులు...

మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ నగరంలోని ఉజ్జయినీ మహాకాల్ ఆలయంకు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో హై అలెర్ట్ ను ప్రకటించారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబా (ఎల్‌టీ) నుండి ఉజ్జయినీ మహాకాల్ ఆలయంకు బెదిరింపులు వచ్చాయి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో జరిగిన వరుస దాడులలో దెబ్బతిన్న లష్కర్-ఎ-తోయిబా ఈ బెదిరింపులకు దిగింది. ఒక నివేదిక ప్రకారం, లష్కర్-ఎ-తోయిబా కమాండర్ మౌల్వి అబు షేక్ రావల్పిండి నుండి ఒక హెచ్చరికతో కూడిన నోట్ ను రాసాడు. ఈ హెచ్చరికను సెప్టెంబర్ 29 న జైపూర్ లోని రైల్వే అధికారులకు పంపారు.

అక్టోబరు 20, నవంబర్ 9 తేదీలలో దాడులు జరుగుతాయని ఉగ్రవాద సంస్థ ఆ లేఖలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 20 న భారత భద్రతా బలగాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వున్నాయి. దీంతో అక్టోబరు 20 న ఎల్‌టీ ఎలాంటి దాడులకు పాల్పడకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే నవంబర్ 9పై భద్రతా బలగాలు దృష్టిసారించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ముందుగానే హై అలెర్ట్ ను ప్రకటించారు. ఎల్‌టీ ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుందని  సమాచారం. ఈ నేపథ్యంలో భోపాల్, గ్వాలియర్, కట్ని, జబల్పూర్ లలో హై అలెర్ట్ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. మరోవైపు ఉజ్జయినీ మహాకాల్ ఆలయంకు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో హై అలెర్ట్ ను ప్రకటించారు. ఇక డిసెంబర్ నెలలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబందించిన వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ సమయంలో హెచ్చరికలు జారీ అవడంతో భద్రతా బలగాలు ఆందోళనలో ఉన్నాయి.