భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి

వారాంతాన భారత్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా పై... ప్రతికారంగా సుంకాలు విధించాలని భారత్‌ నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు 8 సార్లు వాయిదా వేసిన భారత్‌... ఇవాళ 29 అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. వారాంతాన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న  స్టాక్‌ మార్కెట్‌కు... చివరి గంటలో ఈ వార్త రావడంతో సూచీలు భారీగా క్షీణించాయి. ముఖ్యంగా అమెరికాకు ఎగుమతులు చేసే ఆటోమెబైల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిఫ్టి ఇవాళ నామ మాత్రపు నష్టాలతో ప్రారంభమైంది. 11,910 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టికి దాదాపు ఇదే గరిష్ఠ స్థాయి. అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిన నిఫ్టి మిడ్‌ సెషన్‌లో కాస్త కోలుకున్నట్లు కన్పించినా... చివరి గంటలో వచ్చిన భారీ అమ్మకాల ఒత్తిడి కారణంగా ఒకదశలో నిఫ్టి 110 పాయింట్ల వరకు క్షీణించింది. చివరి క్షణాల్లో కోలుకుని 90 పాయింట్ల నష్టంతో 11,823 పాయింట్ల వద్ద ముగిసింది. ఆ స్థాయిల వద్ద మార్కెట్‌ వచ్చే నిలదొక్కుకునే అవకాశముందని... లేని పక్షంలో కనీసం 500 పాయింట్ల పతనం వెంటనే రావడానికి అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఇవాళ నిఫ్టితో పాటు ఇతర రంగాల సూచీలు కూడా భారీగా క్షీణించాయి. దాదాపు 1,500పైగా షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో 42 షేర్లు నష్టాల్లో క్లోజ్‌ కాగా... కేవలం 7 షేర్లు నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇన్‌ఫ్రా టెల్‌, ఎల్‌ అండ్‌ టీ, సన్‌ ఫార్మా, పవర్‌ గ్రిడ్‌, అదానీ పోర్టస్ట్‌ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నిఫ్టి టాప్ లూజర్స్‌... ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐషర్‌ మోటార్స్‌ ఉన్నాయి.  ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో భారీగా లబ్ది పొందిన బ్లూచిప్‌ షేర్లలో ఐఐఎఫ్‌ఎల్‌, వి మార్ట్, కల్పతరు పవర్‌, జీఈ షిప్పింగ్‌,టీమ్‌ లీజ్‌ షేర్లు ఉన్నాయి. ఇక సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌... జెట్‌ ఎయిర్‌వేస్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, సింజైన్‌, జేపీ అసోసియేట్స్‌, పీసీ జ్యువల్లర్స్‌.