ఇంతకాలం ఓపిక పట్టాం..

ఇంతకాలం ఓపిక పట్టాం..

కాంగ్రెస్‌లో అవమానాలు పడిన డి.శ్రీనివాస్‌ను తమ పార్టీలో చేర్చుకుని కేబినెట్‌ హోదా స్థాయి కల్పిస్తే.. ఆయన వేరే పార్టీకి అనుకూలంగా పనిచేయడం సరికాదని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. ఆయన కుమారుడు ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేయాలంటూ డీఎస్‌.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు. కుటుంబంలో అభిప్రాయ బేధాలుంటే వ్యక్తిగతంగా పరిష్కరించువాలని, పార్టీని నాశనం చేసేలా వ్యవహరించకూడదని కవిత అన్నారు. డీఎస్‌ వ్యవహారాన్ని  అధిష్ఠానానికి తెలియజేస్తామని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న డీఎస్‌పై చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ను ఆమె కోరారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వారిపై చర్యలు తప్పవని గతంలోనే కేసీఆర్‌ స్పష్టం చేశారని కవిత గుర్తుచేశారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న డి.శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్‌ నేతలు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. గ్రూప్‌లు కట్టడం, పైరవీలు చేయడం, వేరే పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం డీఎస్‌ నైజం అని పేర్కొన్నారు. ఈ క్రమంలో  ఎంపీ కవిత ఇంట్లో టీఆర్ఎస్ నేతలంతా ఇవాళ సమావేశమయ్యారు. బీబీ పాటిల్‌, ప్రశాంత్‌రెడ్డి, తుల ఉమ, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, జీవన్‌రెడ్డి, షకీల్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు.