గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గనున్న టీవీల ధరలు..!

గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గనున్న టీవీల ధరలు..!

కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? చిన్న టీవీ ప్లేస్‌లో పెద్ద టీవీ పెట్టాలని చూస్తున్నారా? డబ్బా టీవీకి గుడ్‌బై చెప్పి.. ఎస్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలకు మారిపోవాలనుకుంటున్నారా? అయితే, ఇది మీకు గుడ్‌న్యూసే.. ఎందుకుకంటే.. త్వరలోనే ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. టీవీలు తయారు చేసేందుకు వాడే టీవీ ప్యానెల్‌ను దిగుమతి చేసుకోవడానికి వసూలు చేస్తోన్న 5 శాతం కస్టమ్స్ డ్యూటీని రద్దు చేస్తూ నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఓపెన్ బ్యాటరీ, 15.6 అంగుళాల కంటే పైన, లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే(ఎల్‌సీడీ), లైట్ ఎమిటింగ్ డయోడ్(ఎల్ఈడీ)ల టీవీల ప్యానెల్‌లు భారీగా తగ్గనున్నాయని చెబుతున్నారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు(పీసీబీ), ఫిల్మ్ చిప్‌లపై కూడా దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది కేంద్రం.

ఎల్ఈడీ, ఎల్‌సీడీ టీవీల తయారీలో ఓపెన్ సెల్ ప్యానెళ్లు అతి ముఖ్యమైనవి. టీవీ తయారీలో సగం ఖర్చు దీనిపైనే వెచ్చించాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఈ టీవీలు రిపేర్‌కు వస్తే.. తెరమార్చడం కంటే కొత్త టీవీ కొనడమే మేలు అనే నిర్ణయానికి కూడా వస్తుంటారు. ఎందుకంటే ఎల్‌ఈడీ టీవీ తయారీ వ్యయంలో 60 నుంచి 70 శాతం వరకు ఈ ప్యానల్‌కే ఖర్చు అవుతుంది. అయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎల్ఈడీ, ఎల్‌సీడీ టీవీల తయారీ ఖర్చు తగ్గనుంది. ఫలితంగా టీవీ అమ్మకం ధరలు కూడా తగ్గనున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో టీవీల ధరలు 3 నుంచి 4 శాతం వరకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.