అతివలకు అరచేతిలో వైకుంఠం 

అతివలకు అరచేతిలో వైకుంఠం 

రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళలకు మొండిచేయి చూపాయి ప్రధాన పార్టీలు. అధికార టిఆర్ఎస్ తో సహా కాంగ్రెస్, బిజెపి, టిడిపి, టిజేఎస్, బిఎల్ఎఫ్. మహిళలకు ఇచ్చిన సీట్లు కేవలం 40. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మహిళలకే కాస్తో కూస్తో ప్రాధాన్యం దక్కుతోందే తప్ప, కొత్తగా పోటీ చేయాలనుకుంటే గగనమే. 119 స్థానాల్లో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అతి పిసినారి తనం చూపించి నాలుగు సీట్లను మాత్రమే కట్టబెట్టింది.పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత, కోవా లక్ష్మి, రేఖా లక్ష్మీ నాయక్ లకు అవకాశాలు దక్కాయి. గత ప్రభుత్వంలోనూ డిప్యూటీ స్పీకర్ మినహా మహిళలకు స్థానం దక్కలేదని విమర్శలు వెల్లువెత్తినా, అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తన పాత పంథానే కొనసాగించింది. 95 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 11చోట్ల మహిళలకు అవకాశమిచ్చింది. ఆదిలాబాద్ లో చాలా ఏళ్ల తర్వాత మహిళా అభ్యర్ధి జి. సుజాత ఎన్నికల బరిలోకి దిగారు. మిగిలినవారిలో పాత మంత్రులే ఎక్కువ. బిజెపి 11 సీట్లను కేటాయించింది. అభ్యర్ధులంతా పాత, కొత్త కలయిక. ఈసారి ప్రజాకూటమితో కలిసి పోటీ చేస్తున్న టిడిపి  సైతం 13 సీట్లలో ఒక సీటునే మహిళలకు కేటాయించింది. కూకట్ పల్లి నుంచి దివంగత నేత నందమూరి హరికృష్ణ తనయురాలు సుహాసినిని రంగంలోకి దింపింది. 14 సీట్లలో పోటీ పడుతున్న తెలంగాణ జనసమితి సిద్ధిపేటలో భవానీ రెడ్డికి ఇచ్చి సరిపెట్టింది. మూడు స్థానాల్లో పోటీ పడుతున్న సిపిఐ మాత్రం అందరికి భిన్నంగా,  వైరా నుంచి బానోతు విజయకు ఛాన్స్ ఇచ్చింది. ఇక సిపిఎం నేతృత్వంలోని బిఎల్ఎఫ్ సైతం 118 సీట్లకు పోటీకి తలపడుతుంటే అందులో కేవలం 11 సీట్లను మాత్రమే మహిళలకు ఇచ్చింది. మొత్తం మీద అన్నిపార్టీలు మహిళలకు అరచేతిలో వైకుంఠం చూపాయని విమర్శలున్నాయి. సామాజిక కట్టుబాట్లను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న తమకు, గొంతు వినిపించే అవకాశాన్ని పార్టీలు ఇవ్వడం లేదని కొంతమంది మహిళలు వాపోతున్నారు.