రామ మందిరంపై అయోధ్యవాసులు ఏమంటున్నారు?

రామ మందిరంపై అయోధ్యవాసులు ఏమంటున్నారు?

వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో అయోధ్యలో రామ మందిర నిర్మాణం మరోసారి తెరపైకి వచ్చింది. మందిర నిర్మాణం వేగంగా జరపాలని పెరుగుతున్న డిమాండ్ల మధ్య వివాదాస్పద భూమిపై స్థానికుల నుంచి వస్తున్న డిమాండ్ వింటే రాజకీయ పార్టీలు, నేతలకు కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదస్పద స్థలంలో రామ మందిరానికి బదులుగా పిల్లలు ఆడుకొనేందుకు ఆటస్థలంగా మార్చాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. 

సంప్రదాయిక శక్తుల రాజకీయ క్రీడతో అలసిపోయిన అయోధ్యవాసులు ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నారు. రాజకీయాలతో మనసులు కలుషితం అవుతాయని అంటున్నారు. మందిర నిర్మాణంతో రెండు వర్గాల మధ్య సౌహార్ద్ర వాతావరణం చెడుతుందని భావిస్తున్నారు. తరతరాలుగా శాంతియుత వాతావరణంలో జీవిస్తున్న తమ మధ్య రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం 6 డిసెంబర్, 1992న వివాదాస్పద బాబ్రీ మసీదుని కూల్చి చిచ్చు రగిల్చారని ఆరోపిస్తున్నారు. ఇది భారీ సంఖ్యలో తరలివచ్చిన బయటి వ్యక్తుల పనేనని అన్నారు. 

మనుషుల మధ్య దూరం పెంచే మందిరాన్ని నిర్మించడానికి బదులు అన్నివర్గాల పిల్లలు ఆడుకొనే ఆటస్థలంగా మారిస్తే బాగుంటుందని ఆధునికవాదులు సూచిస్తున్నారు. కొందరు సంప్రదాయిక వాదులు సైతం మందిరాన్ని నిర్మించినప్పటికీ మైదానం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను సమర్థిస్తున్నారు. ఇటీవలే సుప్రీంకోర్ట్ రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో విచారణ చేపడతామని ప్రకటించింది.