'స్టే'కి సుప్రీం నో.. యెడ్డీకి లైన్‌ క్లియర్‌

'స్టే'కి సుప్రీం నో.. యెడ్డీకి లైన్‌ క్లియర్‌

కర్ణాటకలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ చేసిన చివరి ప్రయత్నాలు ఫలించలేదు. గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ  అర్ధరాత్రి సుప్రీం కోర్టును అశ్రయించినా నిరాశే ఎదురైంది. గవర్నర్‌ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ యడ్యూరప్పను గవర్నర్‌ ఆహ్వానించడాన్ని సవాల్‌ చేస్తూ బుధవారం రాత్రి 11:47 గంటలకు కాంగ్రెస్‌ పార్టీ అత్యవసరంగా ఓ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన బెంచ్‌ను చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 2 గంటలకు కోర్టు విచారణను ప్రారంభించింది. బీజేపీ తరఫున ముకల్‌ రోహత్గీ, కాంగ్రెస్‌ తరఫున సింఘ్వీ, ప్రభుత్వం తరఫున ఏజీ కేకే వేణుగోపాల్‌, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. గవర్నర్‌ నిర్ణయం చెల్లదని, గురువారం జరిగే ప్రమాణ స్వీకారాన్ని తక్షణం అడ్డుకోవాలని సంఘ్వీ కోరారు.

రాష్ట్రపతి పాలనను నిలిపివేసినప్పుడు గవర్నర్‌ నిర్ణయాన్ని అడ్డుకోలేరా అని ప్రశ్నించారు. అర్ధరాత్రి అత్యవసర విచారణ అనవసరమని అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌, ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీనైనా ఆహ్వానించే అధికారం గవర్నర్‌కు ఉందని రోహత్గీ వాదనలు వినిపించారు. కాంగ్రెస్‌ వాదనలు విన్న ధర్మాసనం.. మెజారిటీ నిరూపించుకోవడానికి అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడం సంప్రదాయం కాదా? అని ప్రశ్నించింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఒక పార్టీని గవర్నరు పిలవకుండా అడ్డుకోలేదని స్పష్టం చేసింది. గవర్నర్‌ను సుప్రీం కోర్టు నియంత్రించదని పేర్కొంటూ ఉదయం 5 గంటలకు తీర్పు వెలువరించింది. బీజేపీ వాదనలు కూడా పూర్తిగా వినాలని, సంఖ్యా బలం ఉన్నదీ లేనిదీ కూడా చూడాలని వ్యాఖ్యానించింది. శుక్రవారం ఉదయం 10.30 మళ్లీ విచారణ చేపడతామని వివరించింది.