గ్రేటర్ వార్ టైం.. మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డు..!

గ్రేటర్ వార్ టైం.. మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డు..!

గ్రేటర్ ఎన్నికల్లో డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది... ఆదివారం ప్రచారానికి తెరపడగా... ప్రలోభాల పర్వం కొనసాగుతోంది... డబ్బులు, మద్యంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మద్యం అమ్మకాలు అనూహ్యంగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. జీహెచ్‌ఎంసీ పోరులో రాజకీయ పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాక మద్యానికి గిరాకీ పెరిగిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది.. ఎందుకుంటే.. ఈ నెల 23న రూ.135 కోట్లు, 24న రూ.107 కోట్లు, 25న రూ.102 కోట్లు, 26న రూ.158 కోట్లు, 27న రూ.170 కోట్లు, 28న రూ.176 కోట్లు, 29న రూ.108 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు.. గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని, సాధారణ రోజుల్లో విక్రయాల కంటే అది 40 శాతం అధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రోజుకు వంద కోట్ల చొప్పున మద్యం అమ్మకాలు జరిగాయి.. ఇక, 2019 నవంబరు 29 వరకు రూ.2,239 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది అదే సమయంలో రూ.2,567 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.. అంటే గతేడాదితో పోల్చితే ఇది దాదాపు రూ.500 కోట్లు ఎక్కువ అని అబ్కారీ శాఖ చెబుతోంది. ఈ నెల 17 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో రూ.154 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగగా.. రంగారెడ్డి జిల్లాలో రూ. 317 కోట్లు, మేడ్చల్ జిల్లాలో రూ. 42 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.100 కోట్ల లెక్కన మొత్తం రూ.615 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.. ఇక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రెండు రోజుల పాటు మద్యం విక్రయాలు అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. మొత్తానికి ప్రచారంలో పాల్గొనే పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి.. గ్రేటర్ ఓటర్లకు పంచడానికి కూడా ఆయా పార్టీల అభ్యర్థులు భారీగా మద్యం కొనుగోలు చేయడమే.. ఈ కొత్త రికార్డుకు కారణంగా అన్నమాట.