కరోనా దెబ్బ.. పలు దేశాల లాక్‌డౌన్ బాట..

కరోనా దెబ్బ.. పలు దేశాల లాక్‌డౌన్ బాట..

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి‌. దీంతో కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ బాట పడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. కొత్తగా 6,800పైగా మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు. 50మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ విజృంభణ ఎక్కువగా ఉండటంతో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించింది. ఏప్రిల్‌ 5వ నుంచి ఏడు రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం ప్రకటించింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఇక, కరోనా తీవ్రతకు యూరప్‌ దేశం ఫ్రాన్స్‌ వణికిపోతోంది. ఇప్పటికే అక్కడ మూడో దశ విజృంభణ కొనసాగుతుండటంతో లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 3 నుంచి నెలపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. పోలాండ్‌లోనూ రోజువారీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతేడాది నవంబరు తర్వాత కేసులు భారీ స్థాయిలో ఉండటం మళ్లీ ఇప్పుడే. దీంతో ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. మూడు వారాల పాటు అత్యవసరం కాని దుకాణాలు, ఇతర కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు.. కరోనా ఉద్ధృతితో బెల్జియం విలవిల్లాడుతోంది. దీంతో మరోసారి నాలుగు వారాల పాటు కఠిన లాక్‌డౌన్‌ విధించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావదొద్దని హెచ్చరించింది.