రేపు రాత్రి 10 గంటలకు పశ్చిమ బెంగాల్ లో ప్రచారం బంద్!!

 రేపు రాత్రి 10 గంటలకు పశ్చిమ బెంగాల్ లో ప్రచారం బంద్!!

పశ్చిమ బెంగాల్ లో చెలరేగుతున్న హింసాకాండను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం చారిత్రక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో ప్రచారం ముగిసేందుకు ఇంకా ఒక రోజు గడువుండగానే రేపు (గురువారం) రాత్రి 10 గంటలకు ప్రచారానికి తెర దించాలని బుధవారం అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ప్రచారం గడువును తగ్గిస్తూ చరిత్రలోనే మొదటిసారి ఆర్టికిల్ 324ను ప్రయోగించింది. గురువారం రాత్రి 10 గంటల తర్వాత పశ్చిమ బెంగాల్ లోని తొమ్మిది పార్లమెంటరీ స్థానాలు-డమ్ డమ్, బరాసట్, బసిర్హట్, జయ్ నగర్, మథురాపుర్, జాదవ్ పూర్, డైమండ్ హార్బర్, దక్షిణ కోల్ కతా, ఉత్తర కోల్ కతాలలో ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

'ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై కమిషన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఈ విధ్వంసానికి కారకులను పట్టుకుంటుందని ఆశిస్తున్నామని' ఈసీ తన ప్రకటనలో పేర్కొంది. అలాగే పశ్చిమ బెంగాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్), అడిషనల్ డైరెక్టర్ జనరల్ (సీఐడీ)లను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఏడీజీ సిఐడీగా ఉన్న రాజీవ్ కుమార్ ను హోమ్ మంత్రిత్వశాఖకు అటాచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 

నిన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కోల్ కతాలో రోడ్ షో నిర్వహించిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, టీఎంసీ కార్యకర్తల మధ్య హింస చెలరేగడంతో ఎన్నికల సంఘం ఈ చర్య తీసుకుంది.