రేపు మూడో దశ ఎన్నికల ఓటింగ్

రేపు మూడో దశ ఎన్నికల ఓటింగ్

లోక్ సభ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ రేపు (ఏప్రిల్ 23) జరగనుంది.  13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 సీట్లలో ప్రజలు తమ ప్రతినిధులను ఓటింగ్ ద్వారా ఎన్నుకోనున్నారు. మూడో దశ లోక్ సభ ఎన్నికలు జరిగే స్థానాలు గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సామ్, గోవా, జమ్ముకశ్మీర్, త్రిపుర రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యులలో ఉన్నాయి. మూడో దశ ఎన్నికల ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. తూర్పు త్రిపుర సీటు పోలింగ్ వాస్తవానికి ఏప్రిల్ 18న జరగాల్సి ఉండగా అక్కడి శాంతిభద్రతల పరిస్థితి స్వేచ్ఛగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించేందుకు అనువుగా లేదని ఎన్నికల సంఘం ఏప్రిల్ 23కి వాయిదా వేసింది.

లోక్ సభ ఎన్నికలు 2019 మూడో దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రముఖ అభ్యర్థులలో రెండు ప్రధాన పార్టీల అధ్యక్షులు ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లోక్ సభకు తొలిసారిగా గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి బరిలోకి దిగారు. ఇతర కీలక అభ్యర్థులలో సమాజ్ వాదీ పార్టీ పెద్దదిక్కు ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురీ నుంచి నిలబడ్డారు. ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ (లోహియా) అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి రంగంలో నిలిచారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి నుంచి పోటీ చేస్తున్నారు. బీహార్ లోని మాధేపురాలో అధికార్ పార్టీ-లోక్ తాంత్రిక్ (జేఏపీ-ఎల్) చీఫ్ పప్పు యాదవ్, ఆర్జేడీ అభ్యర్థి శరద్ యాదవ్ తో తలపడుతున్నారు. ఒడిషాలోని పూరీలో ముక్కోణపు పోటీ జరుగుతోంది. బీజేడీకి అభ్యర్థి పినాకీ మిశ్రా, బీజేపీ తరఫున సంబిత్ పాత్రా, కాంగ్రెస్ నుంచి సత్య ప్రకాష్ నాయక్ ఢీ కొంటున్నారు.

గుజరాత్, కేరళ, గోవాలలో అన్ని స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో 14, కర్ణాటకలో 14, ఉత్తరప్రదేశ్ లో 10, ఛత్తీస్ గఢ్ లో 7, ఒడిషాలో 6, పశ్చిమ బెంగాల్ లో 5, బీహార్ లో 5, అస్సామ్ లో 4, జమ్ముకశ్మీర్ లో 1, త్రిపురలో 1 స్థానానికి పోలింగ్ జరగనుంది. కేంద్ర పాలిత ప్రాంతాలు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో రేపు ఓటింగ్ జరుగుతుంది.