పోలింగ్ బృందాలకు ఈవీఎం, వీవీప్యాట్లతో పాటు ఉల్లిపాయలు

పోలింగ్ బృందాలకు ఈవీఎం, వీవీప్యాట్లతో పాటు ఉల్లిపాయలు

లోక్ సభ ఎన్నికల్లో ఏడోది, చివరి దశ పోలింగ్ మే 19న జరగనుంది. మధ్యప్రదేశ్ లోని ఝాబువా నుంచి పోలింగ్ సిబ్బందిని వారి పోలింగ్ కేంద్రాలకు పంపించారు. పోలింగ్ బృందాలకు ఈవీఎం, వీవీప్యాట్లతో పాటు ఉల్లిపాయలు కూడా ఇచ్చి మరీ పంపించారు అధికారులు.

ఝాబువా జిల్లాలోని 981 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు పోలింగ్ బృందాలకు ఈవీఎం, వీవీప్యాట్లతో అందజేశారు. ఈ బృందాలను జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి పంపించారు. ఇందులో విశేషమేంటంటే పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రితో పాటు ఉల్లిపాయలు కూడా పంచిపెట్టారు.

మే నెలలో ఇక్కడ ఉష్ణోగ్రతలు వరుసగా 41 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. అందువల్ల ఎండవేడి, వడదెబ్బ నుంచి రక్షించేందుకు పోలింగ్ సిబ్బందికి ఉల్లిపాయలు పంచిపెట్టారు. ఎండలు, వడగాడ్పులపై సిబ్బంది నుంచే ఈ సూచన వచ్చిందని, దానికి తాము కార్యరూపం ఇచ్చినట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రబల్ సిపాహా చెప్పారు. 

ఝాబువాలో గత కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే మే నెలలో ఇక్కడ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.