దీదీ సంచలన నిర్ణయం..

దీదీ సంచలన నిర్ణయం..

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్టీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ తరపున 41 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. టీఎంసీ నుంచి ఈసారి మహిళలు అత్యధిక సంఖ్యలో పోటీకి దిగుతున్నట్లు తెలిపారు. తమ పార్టీ నుంచి ముగ్గురు బెంగాలీ నటీమణులు  పోటీ చేయనున్నారని మమత తెలిపారు. నుస్రత్‌ జహాన్‌, మిమీ చక్రబర్తి, మున్‌ మున్‌ సేన్‌లకు టికెట్‌ ఖరారు చేసినట్లు ఆమె ప్రకటించారు. అసనోల్‌ నియోజక వర్గం నుంచి కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియోకు పోటీగా మున్‌ మున్‌ సేన్‌ బరిలోకి దిగుతారని, మల్దా లోక్‌సభ స్థానం నుంచి ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఎంసీలో చేరిన మౌసమ్‌ నూర్‌ పోటీ చేస్తారని తెలిపారు. ఇటీవల దారుణంగా హత్యకు గురైన టీఎంసీ ఎమ్మెల్యే సత్యజిత్‌ బిస్వాస్‌ భార్య రుపాలీ బిస్వాస్ కూడా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతారని మమత పేర్కొన్నారు. ఇక మిడ్నాపూర్‌ ఎంపీ సంధ్యా రాయ్‌, ఇద్రిస్‌ అలీ, ఉమా సోరెన్‌ తదితరులు ఈ ఎన్నికల్లో పోటీ చేయరని ఆమె స్పష్టం చేశారు.