ఛత్తీస్ గఢ్ లో సత్తా చాటిన కమలం

ఛత్తీస్ గఢ్ లో సత్తా చాటిన కమలం

మొన్నటి ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని స్పష్టమైన ఆధిక్యంతో అధికారం హస్తగతం చేసుకున్న కాంగ్రెస్, లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఆ ఆధిక్యాన్ని చేజార్చుకుంది. 90 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ సొంతంగా 68 సీట్లు గెలిచింది. బీజేపీ 15 సీట్లకు పరిమితమైంది. కానీ లోక్ సభ ఎన్నికల్లో ఛత్తీస్ గఢ్ కోటపై తిరిగి కాషాయ జెండా రెపరెపలాడింది. రాష్ట్రంలోని మొత్తం 11 పార్లమెంట్ స్థానాల్లో 9ని కమల దళం చేజిక్కించుకుంది. ఈ సారి ఎన్నికల్లో 10 మంది కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలన్న బీజేపీ వ్యూహం విజయవంతం అయింది. రాష్ట్రమంతటా కాషాయ కెరటం ఉవ్వెత్తున ఎగియడంతో కాంగ్రెస్ 2 స్థానాల్లో మాత్రమే గెలుపొంది. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 10, కాంగ్రెస్ ఒక స్థానం గెలిచాయి. అసెంబ్లీ ఫలితాలను బట్టి కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరుగుతుందని భావించిన వారి అంచనాలు తుది ఫలితాలతో తల్లకిందులయ్యాయి.