'ఫోన్ ద్వారా ఓటు' ఫిర్యాదుపై సైన్యానికి ఈసీ నోటీస్

'ఫోన్ ద్వారా ఓటు' ఫిర్యాదుపై సైన్యానికి ఈసీ నోటీస్

జమ్ముకశ్మీర్ లోని లేహ్ ప్రాంతంలో సైనికాధికారులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందాయి. ఎప్పుడు ఇచ్చినట్టుగా సైనికులు ఓటు వేయడానికి బ్యాలెట్ పేపర్లు అందజేయకుండా ఫోన్ ద్వారా సైనికులను ఎవరికి ఓటేస్తారో కనుక్కొని వారికి బదులు ఓట్లు వేసి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన లేహ్ ఎన్నికల అధికారి అవనీ లవాసా ఇవాళ సైనిక ఉన్నతాధికారులకు ఫిర్యాదును ఉటంకిస్తూ నోటీస్ జారీ చేశారు. ఇది 'రహస్య ఓటింగ్' విధానాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని, 'ఇందులో ఏదైనా అక్రమాలు జరిగినట్టు తేలితే న్యాయపరంగా కఠిన చర్యలు తప్పవని' హెచ్చరించారు. స్వతంత్ర అభ్యర్థులు సజ్జాద్ హుస్సేన్, అస్గర్ అలీ కర్బలాయి నుంచి ఫిర్యాదులు వచ్చినట్టు లేహ్ ఎన్నికల అధికారి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. అయితే వీళ్లు నిర్దిష్టంగా ఎలాంటి ఘటనలు వివరించలేదన్నారు. 

అయితే సైన్యం ఈ ఆరోపణలను తిరస్కరించింది. 'ఫిర్యాదులపై జరిపిన ప్రాథమిక దర్యాప్తులలో ఆ ఆరోపణలు ఉత్తివేనని తేలింది. సైన్యం ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. లోతైన దర్యాప్తు జరుగుతోందని, నిష్పక్షపాతంగా వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు' శ్రీనగర్ లోని పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (డిఫెన్స్) కల్నల్ రాజేష్ కాలియా తెలిపారు. 'ఆర్మీ రాజకీయాలకు అతీతంగా ఉందని, ఆ విలువల స్ఫూర్తిని అక్షరాలా కొనసాగిస్తామని' చెప్పారు.