ప్రత్యర్ధితో మేనకాగాంధీ వాగ్వాదం

ప్రత్యర్ధితో మేనకాగాంధీ వాగ్వాదం

కేంద్ర మంత్రి, సుల్తాన్‌పూర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మేనకాగాంధీ, తన ప్రత్యర్థి సోనూ సింగ్‌ల మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం పిలీభీత్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న మేనకాగాంధీ ఈ ఎన్నికల్లో సుల్తాన్‌పూర్‌ నుంచి బరిలో నిలిచిన సంగతి తెలసిందే. అయితే ఆ స్థానం నుంచి ఎస్పీ, బీఎస్పీ కూటమి తరఫున సోనూ సింగ్‌ బరిలో ఉన్నారు. కాగా, ఆరో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా  ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆదివారం ఉదయం పోలింగ్‌ ప్రారంభం అయింది. నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ బూతులను పరిశీలిస్తున్న మేనకాగాంధీ.. ఎస్పీ, బీఎస్పీ నాయకులు ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘మీ రౌడీయిజం ఇక్కడ పని చేయదని’  సోనూ సింగ్‌ను ఉద్దేశించి మేనకాగాంధీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఖండించిన సోనూ సింగ్‌ తాను ఏ తప్పు చేశానో చెప్పాలంటూ మేనకాగాంధీని ప్రశ్నించారు. ఈ సమయంలో సోనూ సింగ్‌ అనుచరులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇరువురు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.