రెండో దశలో ఓటేసిన మహిళల సంఖ్య 7.8 కోట్లు

రెండో దశలో ఓటేసిన మహిళల సంఖ్య 7.8 కోట్లు

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 95 లోక్ సభ స్థానాల్లో గురువారం రెండో దశ ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నిజానికి రెండో దశలో 97 స్థానాలకు ఓటింగ్ జరగాల్సి ఉండగా తమిళనాడులోని వెల్లూర్, త్రిపుర తూర్పు నియోజకవర్గాల్లో ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. 

రెండో దశలో వెల్లూరు తప్ప తమిళనాడులోని అన్ని స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ లోని 8, బీహార్ లోని 5 స్థానాల్లో కూడా పోలింగ్ జరిగింది. ఈ దశలో కర్ణాటకలో 14, మహారాష్ట్రలోని 10 సీట్లలో ఓటింగ్ నిర్వహించారు. తమిళనాడులోని 37 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. క్యూలో ఉన్నవారికి టోకెన్లు ఇచ్చి వారిని మాత్రమే ఓటేయడానికి అనుమతించారు. మదురైలో ఓటింగ్ 8 గంటలకు ముగిసింది. 

పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు సీఈసీ సునీల్ అరోరా ప్రకటించారు. ఎన్నో కష్టాలకోర్చి భారీ స్థాయిలో ఓటింగ్ కి తరలివచ్చిన మహిళలు, దివ్యాంగులను ఆయన అభినందించారు. సుమారుగా 7.8 కోట్ల మంది మహిళలు, 8.45 లక్షల మంది దివ్యాంగులు రెండో దశ ఎన్నికలు ఓటేసినట్టు సీఈసీ సునీల్ అరోరా ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు కృషి చేసిన అధికారులను అరోరా ప్రశంసించారు.

పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా సాగిందని.. కానీ గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గిందని సునీల్ అరోరా తెలిపారు. 2014లో 82.1 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా ఈ సారి అది 78 శాతంగా ఉందని చెప్పారు. తమిళనాడులో కూడా పోలింగ్ శాతం తగ్గింది. 2014 ఎన్నికల్లో 73.58 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా ఈ సారి అది 72 శాతం మాత్రమేనని అన్నారు. 

జమ్ముకశ్మీర్ లో కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉధమ్ పూర్ లో ఓటింగ్ శాతం 66.67గా ఉంది. గత ఎన్నికల్లో ఇది 71.48 శాతం. సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీనగర్ లో పోలింగ్ శాతం 13.43 మాత్రమే నమోదైంది. 2014లో 25.07 శాతం ఓటింగ్ నమోదైంది. అస్సామ్ లో 5 గంటల వరకు 73.32 శాతం ఓట్లు పోలయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ శాతం 76.07. మణిపూర్ లో ఓటింగ్ శాతం 74.3. 2014లో ఇక్కడ పోలింగ్ శాతం 75.16గా నమోదైంది. మణిపూర్ లోని ఒక పోలింగ్ స్టేషన్ లో ఈవీఎం ధ్వంసం చేశారని ఈసీ తెలిపింది. 

బీహార్ లో 62.52 శాతం పోలింగ్ జరిగింది. 2014లో నమోదైన 61.93 శాతాన్ని మించడం విశేషం. 2014 ఎన్నికలతో మహారాష్ట్ర, ఒడిషాలలో తక్కువ ఓటింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 62 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. 2014 ఎన్నికల్లో ఇది 62.64 శాతం. ఒడిషా సాయంత్రం 6 గంటలకు 64 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014లో ఇది 73.75 శాతం. ఉత్తరప్రదేశ్ లో సాయంత్రం 6 గంటల వరకు 62.3 శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో ఇది 61.87 శాతం మాత్రమేనని ఈసీ వివరించింది. ఒక కేంద్ర పాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటలకు మొత్తంగా  66 శాతం పోలింగ్ జరిగింది. 

రెండో దశ ఎన్నికల్లో రూ.2,632.73 కోట్ల విలువైన సొమ్ముని ఈసీ స్వాధీనం చేసుకున్నట్టు సునీల్ అరోరా ప్రకటించారు. రూ.697 కోట్ల నగదు, రూ.219 కోట్ల విలువైన మద్యం, రూ.1,151 కోట్ల మత్తుమందులు, రూ.512 కోట్ల విలువైన లోహాలు జప్తు చేసినట్టు తెలిపారు.