ఎట్టి పరిస్థితుల్లోనూ పట్నా సాహిబ్ నుంచే పోటీ చేస్తా: శత్రుఘ్నసిన్హా

ఎట్టి పరిస్థితుల్లోనూ పట్నా సాహిబ్ నుంచే పోటీ చేస్తా: శత్రుఘ్నసిన్హా

పార్టీతో విభేదాలు ఉన్నప్పటికీ తాను తన నియోజకవర్గాన్ని మార్చేది లేదని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా.  రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం ఏమైనప్పటికీ 'ఎట్టి పరిస్థితుల్లోనూ' తాను మరోసారి పట్నా సాహిబ్ సీటు నుంచే పోటీకి దిగుతానని షాట్ గన్ అన్నారు. 'పరిస్థితి ఎలా ఉన్నా, స్థానం మాత్రం అదే ఉంటుంది' అని సిన్హా చెప్పినట్టు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

కొన్నేళ్లుగా పలు అంశాలపై ప్రస్తుత బీజేపీ నాయకత్వంతో విభేదిస్తున్న షాట్ గన్ సిన్హా, సొంత పార్టీపైనే విమర్శలు రువ్వుతూ వస్తున్నారు. పార్టీ అధికారిక విధానాలకు వ్యతిరేకంగా నిలిచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలపై తీవ్ర విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. జనవరిలో కోల్ కతాలో నిర్వహించిన బీజేపీయేతర పక్షాల ర్యాలీలో ప్రతిపక్ష నేతలతో వేదిక పంచుకున్నారు.

ఇటీవలే లక్నోకి వెళ్లిన శత్రుఘ్న సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. దీంతో సిన్హా భార్య పూనమ్ సిన్హా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారని, హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోక్ సభ స్థానం నుంచి పోటీకి దిగుతారనే ఊహాగానాలు వినిపించాయి. 

ఈ ఊహాగానాలను శత్రుఘ్న సిన్హా ధ్రువీకరించలేదు, ఖండించలేదు. 'చాలా కాలంగా పూనమ్ సిన్హా సమాజసేవలో తలమునకలుగా ఉంది. ఆమెను అందరూ అభిమానిస్తారు. ఆమె పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇది జరిగేది లేనిదీ కాలమే నిర్ణయిస్తుందని" చెప్పారు.

అఖిలేష్ తో సిన్హా సమావేశం తర్వాత మేలో జరగబోయే ఈ లోక్ సభ సాధారణ ఎన్నికల్లో ఆయన సమాజ్ వాదీ పార్టీ టికెట్ పోటీ చేస్తారనే మాటలు వినిపించాయి. సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జయప్రకాష్ జయంతి కార్యక్రమానికి ఆయన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాతో కలిసి హాజరవడం దీనికి బలాన్నిస్తోంది.