ఏడో దశ ఎన్నికల్లో కీలక స్థానాలు, అభ్యర్థులు!!

ఏడో దశ ఎన్నికల్లో కీలక స్థానాలు, అభ్యర్థులు!!

లోక్ సభ ఎన్నికల ఏడోది, చివరి దశలో మే 19న ఎనిమిది రాష్ట్రాల్లోని 59 సీట్లకు ఓటింగ్ జరుగుతుంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ స్థానం సహా దేశంలోని అనేక కీలక లోక్ సభ సీట్లు ఉన్నాయి. రాజకీయ పరంగా ఈ నియోజకవర్గాలు యావద్దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

వారణాసి
15 ఏళ్ల తర్వాత ఒక ప్రధానమంత్రి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. చివరిసారిగా 2004లో అటల్ బిహారీ వాజ్ పేయి లక్నో నుంచి పోటీ చేశారు. (మన్మోహన్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు) ఇలా ప్రధానమంత్రి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎనిమిదో ప్రధాని మోడీయే. గత ఎన్నికల్లో మోడీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీలో గెలిచారు.

జవహర్ లాల్ నెహ్రూ-ఫూల్ పూర్
ఇందిరా గాంధీ-రాయ్ బరేలీ (1967&1971)
చరణ్ సింగ్-బాగ్ పట్ (1977&1980)
రాజీవ్ గాంధీ-అమేథీ (1984&1989)
చంద్రశేఖర్-బలియా(1989&1991)-ప్రధాని పదవిలో ఆర్నెల్లు మాత్రమే ఉన్నారు
పీవీ నరసింహారావు-నంద్యాల(1991&1996)(ఉప ఎన్నికల్లో గెలిచారు. 1996లో నంద్యాల, బరంపురం నుంచి పోటీ చేశారు)
అటల్ బిహారీ వాజ్ పేయి-లక్నో(1998&1999)
నరేంద్ర మోడీ-వారణాసి(2014&2019లో పోటీ చేస్తున్నారు)

గురుదాస్ పూర్ లో బాలీవుడ్ హవా 
బాలీవుడ్, భారత రాజకీయాల్లో వారసత్వం కొనసాగుతోంది. గురుదాస్ పూర్ బీజేపీ అభ్యర్థి సన్నీ డియోల్ కి ఇవి రెండూ వర్తిస్తాయి. ఆయన తండ్రి, బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (2004-09)కి బికనేర్ నుంచి ఎంపీగా గెలిచారు. మరో నటుడు వినోద్ ఖన్నా నాలుగు సార్లు (1998,1999,2004,2014) బీజేపీ టికెట్ పై గెలిచారు.

చండీగఢ్ 
చండీగఢ్ లోక్ సభ స్థానానికి బీజేపీ మరోసారి సినీ నటి కిరణ్ ఖేర్ ని నిలిపింది. ఈ సీటులో కిరణ్ ఖేర్ రెండో సారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు.

దుమ్కా 
ఇప్పటి వరకు తొమ్మిది సార్లు నెగ్గిన ఈ సీటులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబూ సోరెన్ మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్ ఓడించారు.

హమీర్ పూర్ 
హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ పార్లమెంటరీ స్థానంలో ఈ సారి ఇద్దరు ఠాకూర్లు తలపడుతున్నారు. బీజేపీ మరోసారి అనురాగ్ ఠాకూర్ ని బరిలోకి దించింది. కాంగ్రెస్ కూడా మాజీ అథ్లెట్, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన రామ్ లాల్ ఠాకూర్ ని పోటీలో నిలిపింది. అనురాగ్ వరుసగా మూడు సార్లు గెలవగా, రామ్ లాల్ మూడు సార్లు ఓడిపోయారు.

మీర్జాపూర్ 
ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ-అప్నా దళ్ తరఫున సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ పోటీ చేస్తున్నారు. 

పట్నా సాహిబ్ 
బీహార్ లోని పట్నా సాహిబ్ స్థానంలో ఈ సారి బీజేపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాను బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్ ఢీ కొంటున్నారు. 

దక్షిణ కోల్ కతా 
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 1991 నుంచి 2011 వరకు 6 సార్లు గెలుసొందిన దక్షిణ కోల్ కతా సీటు నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్ర కుమార్ బోస్ బీజేపీ అభ్యర్థిగా  పోటీ చేస్తున్నారు.

గోరఖ్ పూర్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచుకోటగా మలచుకొన్న గోరఖ్ పూర్ నుంచి భోజ్ పురి సూపర్ స్టార్ రవి కిషన్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.