ఈ విజయం చారిత్రాత్మకం

ఈ విజయం చారిత్రాత్మకం

బీజేపీ ఒంటరిగా 300 పైచిలుకు సీట్లు గెలిచే దిశగా సాగుతోంది. '50 ఏళ్ల తర్వాత ఒక ప్రధానమంత్రి స్పష్టమైన మెజారిటీతో గెలిచి మరోసారి పూర్తి మెజారిటీతో తిరిగి నెగ్గడం జరిగిందని, ఇది చారిత్రాత్మక విజయమని' బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం అన్నారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ' స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ మార్గదర్శనంలో బీజేపీ అతిపెద్ద విజయం సాధించిందని' చెప్పారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిపెట్టినందుకు పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 'ఇది భారత ప్రజలందరి విజయం. ఇది 11 కోట్ల బీజేపీ కార్యకర్తల శ్రమకు దక్కిన విజయమని' షా తెలిపారు.

2014 ఎన్నికల్లో బీజేపీ నినాదం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' ను గుర్తు చేస్తూ 2014 నుంచి 2019 వరకు మోడీ సర్కార్ చేసిన సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ విధానానికి దక్కిన విజయం ఇదన్నారు. ఇది ఆ విధానం యొక్క విజయమని తెలిపారు. మోడీ ప్రభుత్వం సామాజిక పథకాలను ప్రస్తావిస్తూ 'ఐదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 50 కోట్ల నిరుపేద కుటుంబాల అభ్యున్నతికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని' వివరించారు. దేశ ప్రజలందరికీ అమిత్ షా ధన్యవాదాలు తెలియజేశారు. కోట్లాది నిరుపేద కుటుంబాల ఆశీస్సులు, మద్దతుతో జాతీయ ఎన్నికల్లో ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా విమర్శిస్తూ ' భవిష్యత్తులో వారసత్వ పార్టీలు అసంబద్ధమవుతాయని ఈ విజయంతో రుజువైందని' అన్నారు. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదని ఎద్దేవా చేశారు. 50 శాతానికి పైగా ఓటర్లు బీజేపీకి ఓటేశారని చెప్పారు. ఎన్నికల్లో ఎంతో హింసాకాండ, రిగ్గింగ్ చేసినప్పటికీ పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 18 సీట్లు గెలవడం, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్టీ బలోపేతం కానున్నదనడానికి సూచన అని వివరించారు. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-బీఎస్పీల మహాకూటమి కారణంగా బీజేపీకి సీట్లు తగ్గుతాయన్న అంచనాలు తలకిందులయ్యాయని చెబుతూ కుల, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు బీజేపీ పక్షాన వచ్చిన ఈ భారీ తీర్పు కింద సమాధి అయ్యాయని అన్నారు.