ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం

ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం

ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం.. ఓటింగ్‌కు వెళ్లారు. అయితే, ఓటింగ్ సమయంలో కాంగ్రెస్, టీఎంసీ, బీఎస్పీ, జేడీయూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేయగా.. బిల్లుకు అనుకూలంగా 303 ఓట్లు పడగా... వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. అప్పటికప్పుడు మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వాలనిచూసే భర్తలకు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించేందుకు వీలు కల్పిస్తోంది ట్రిపుల్ తలాక్ బిల్లు. లింగ సమానత్వం, న్యాయం కోసం ఈ చట్టం అవశ్యమంటూ ఈ బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇక, 2017 జనవరి నుంచి ఇప్పటి వరకు 574 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదు కాగా... సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 300లకు పైగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్టు మీడియాలో వచ్చిందన్నారు. అంతేకాదు, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, మలేసియా, ఇండోనేషియా, జోర్డాన్, ఈజిప్ట్, టునీషియా సహా 20 దేశాలు ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశాయని గుర్తుచేశారు కేంద్రమంత్రి.