ఆస్తి రూ.1,107 కోట్లు.. 1,556 ఓట్లు

ఆస్తి రూ.1,107 కోట్లు.. 1,556 ఓట్లు

ఈ సాధారణ ఎన్నికల్లో కోట్లకు పడగలెత్తిన వాళ్లెందరో పోటీ చేశారు. వీళ్లందరిలో అత్యంత సంపన్నుడు బీహార్ కు చెందిన రమేష్ కుమార్ శర్మ. పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ కె శర్మ నామినేషన్ సందర్భంగా తనకు రూ.1,107 కోట్ల ఆస్తి ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఓడలను తుక్కుగా మార్చే పరిశ్రమకు యజమాని అయిన శర్మ, తనను గెలిపిస్తే ప్రతి ఏడాది తన పరిశ్రమల్లోనే ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు నమ్మినట్టు లేరు. ఈయనకు కేవలం 1,556 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్లు కూడా కోల్పోయారు పాపం.

ప్రజాస్వామ్యంలో ధనబలం ఒక్కటే ఉంటే చాలదు ప్రజాబలం కూడా ఉండాలని రుజువు చేశారు ఓటర్లు. సంపన్న అభ్యర్థుల జాబితాలో టాప్‌ 10లో ఉన్న వారిలో ఐదుగురు మాత్రమే గెలిచారు. మిగతా ఐదుగురు ఓడిపోయారు. దేశంలోనే రెండో సంపన్న అభ్యర్థిగా నిలిచారు అపోలో గ్రూప్ చైర్మేన్ సి ప్రతాప్ రెడ్డి అల్లుడైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కిందటేడాది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విశ్వేశ్వర్ రెడ్డి తనకు రూ. 895కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి జి రంజిత్‌ రెడ్డి చేతిలో 14,317 ఓట్లతో ఓడిపోయారు. 

మరో సంపన్న అభ్యర్థి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా పరాజయం పాలయ్యారు. మధ్యప్రదేశ్ లోని గుణ నుంచి పోటీ చేసిన ఈయన ఆస్తుల విలువ రూ.374కోట్లుగా ప్రకటించారు. దేశంలో ఐదో సంపన్న అభ్యర్థి అయిన సింధియా బీజేపీ అభ్యర్థి కృష్ణపాల్ సింగ్ చేతిలో 1,25,549 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పారిశ్రామికవేత్త ప్రసాద్ వీర్ పొట్లూరి తన సమీప టీడీపీ అభ్యర్థి కేశినేని నాని చేతిలో 8,726 ఓట్లతో పరాజయం చవిచూశారు. ఇటీవలే వైసీపీలో చేరిన వరప్రసాద్‌ దేశంలోనే ఆరో సంపన్న అభ్యర్థి. ఆయన తనకు రూ. 347 కోట్ల ఆస్తులున్నట్లు నామినేషన్‌ సమయంలో వెల్లడించారు. బిహార్‌లోని పూర్ణియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ నేత ఉదయ్‌ సింగ్‌ ఏడో సంపన్న అభ్యర్థిగా నిలిచారు. ఆయన తన ఆస్తుల విలువ రూ. 341కోట్లుగా ప్రకటించారు. ఉదయ్ సింగ్  2,63,461 ఓట్ల తేడాతో చిత్తయ్యారు.

ఇక టాప్‌ 10 సంపన్నులలో ఐదుగురు లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. వీరిలో మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌ నాథ్‌ కుమారుడు నకుల్‌ నాథ్‌ దేశంలోనే మూడో అత్యంత సంపన్న అభ్యర్థి. ఆయన ఆస్తుల విలువ రూ. 660కోట్లు. ఇన్నాళ్లూ తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ఛింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి నకుల్‌ పోటీ చేసి 37,536 ఓట్లతో విజయం సాధించారు. తమిళనాడు కాంగ్రెస్ నేత హెచ్. వసంతకుమార్‌(ఆస్తుల విలువ రూ. 417కోట్లు), కర్ణాటక కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్‌(ఆస్తుల విలువ రూ. 338కోట్లు), టీడీపీ నాయకుడు గల్లా జయదేవ్‌(ఆస్తులు రూ. 305కోట్లు), వైఎస్సార్సీపీ నేత రఘురామ కృష్ణంరాజు(ఆస్తులు రూ. 325కోట్లు) కూడా విజయం సాధించారు.