కొత్త ఎంపీలకు కీలక సూచనలు..

కొత్త ఎంపీలకు కీలక సూచనలు..

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికయ్యే పార్లమెంట్ సభ్యులకు కీలక సూచనలు చేశారు లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాత్సవ.. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఢిల్లీకి వచ్చేటప్పుడు.. ఎంపీగా ఎన్నికైన వారికి రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికైనట్టుగా ఇచ్చే ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంట తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సారి  ఎంపీలందరికీ ఒకేసారి పర్మినెంట్ కార్డులు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇక కొత్తగా ఎన్నికై ఢిల్లీకి వచ్చే లోకసభ సభ్యుల కోసం ఎయిర్ పోర్టు, పలు రైల్వే స్టేషన్లలో గైడ్ పోస్ట్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్తగా ఎన్నికై ఢిల్లీకి వచ్చే ఎంపీలకు గతంలో హోటళ్లలో వసతి ఏర్పాటు చేసే విధానాన్ని ఈ సారి రద్దుచేశామన్నారు స్నేహలత శ్రీవాత్సవ.

17వ లోకసభకు ఎన్నికైన కొత్త ఎంపీలకు వెస్టర్న్ కోర్టు, కొత్తగా నిర్మించిన వెస్టర్న్ కోర్టు అనుబంధ భవనాలలోనూ, వివిధ రాష్ట్రాల భవనాలలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసినట్టు స్నేహలత శ్రీవాత్సవ తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎంపీల జీవిత భాగస్వాములకు తాత్కాలిక పాస్‌లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఒక్కో నోడల్ ఆఫీసర్‌కు 8 నుంచి 10 మంది ఎంపీల చొప్పున కేటాయించి, ఎప్పటికప్పుడు ఎంపీలను సంప్రదిస్తూ, సహాయ సహకారాలు అందించే బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు.