జేపీ కీలక సూచనలు..

జేపీ కీలక సూచనలు..

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో వెళ్లాలంటే చేయాల్సిన పనులపై కీలక సూచనలు చేశారు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ... విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్, నరేంద్ర మోడీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు అన్నాక.. ప్రజా తీర్పులో ఎవరో ఒకరు గెలవక తప్పదని.. ఎన్నికలను యుద్దంలా ఎవరూ చూడొద్దు.. ప్రజల కోసం అందరూ కలిసి పని చేయాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించాలన్న జేపీ.. కేంద్రం నుంచి న్యాయబద్దంగా రావాల్సిన‌ వాటిని తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు. నేడు ఎన్నికలలో అభివృద్ధి, మౌలిక వసతుల అంశం ప్రస్తావనే లేదు.. కుల, మతాలు, అంతరాలు, ప్రజలకు తాయిలాలు ప్రకటించడమే ఆనవాయితీగా మారిందని విమర్శించారు. కులాల విభజనతో నేడు నడుస్తున్న రాజకీయాలు ప్రజలకు మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేసిన జేపీ.. కులాల వల్ల ఒకస్థాయి ప్రజలకు మేలు తప్ప, సామాన్యులు తీవ్రంగా నష్ట పోతున్నారని వ్యాఖ్యానించారు. 

ఇక అధికారం కోసం ఇష్టం వచ్చినట్లు తాయిలాలు ప్రకటించి ప్రజలను సోమరులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన జేపీ.. నేను ఇచ్చా, నేను ఇస్తా అని నేతలు చెప్పుకోవడం విడ్డూరం అన్నారు. ప్రజల సొమ్మును ప్రజలకే తమ స్వార్థం కోసం పంచి గొప్పగా చెప్పుకోవడం ఏపీ నేతలకే చెల్లిందని సెటైర్లు వేసిన లోక్‌సత్తా నేత... కోట్ల రూపాయలు ఓట్ల కోసం ఖర్చు పెడితే.. వారు ప్రజాసేవ ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. ఇప్పడు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఎంత ఖర్చవుతుందో కూడా వారికే తెలియదు! అంటూ ఎద్దేవా చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పంతాలు వీడి ఏపీకి న్యాయం చేసేలా వ్యవహరించాలని సూచించారు. నలుగురు జాతీయస్థాయి ఆర్థిక నిపుణులు ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోవాలన్న జేపీ.. ఢిల్లీ నుంచి నిధులు తేలేని పక్షంలో.. మనం కట్టే వాటిని వినియోగించుకునేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. రూ.50 వేల కోట్లు రావాల్సిన ఉన్నందున... వాటిని తెచ్చే అంశాలపై దృష్టి పెట్టాలని కీలక సూచలను చేశారు. మంచి విద్య, వైద్యం అందించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలన్న జేపీ... సురాజ్య యాత్ర ద్వారా అధ్యయనం చేసి విధివిధానాలను ప్రభుత్వాలకు, పార్టీలకు ఇచ్చాను.. ఇప్పటికైనా సమగ్ర ప్రణాళిక తయారు చేసుకుని వాటిని అమలు చేయాలన్నారు. ఇప్పుడు విద్య, వైద్యానికి వినియోగిస్తున్న డబ్బు కన్నా ఖర్చు తక్కువే అవుతుంది.. వ్యవసాయం, పరిశ్రమ రంగాలను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సూచించారు లోక్‌సత్తా వ్యవస్థాపకులు.