అమ్మాయి కోసం కొట్టుకున్న ఉద్యోగులు...ముగ్గురి మీద వేటు

అమ్మాయి కోసం కొట్టుకున్న ఉద్యోగులు...ముగ్గురి మీద వేటు

ఓ యువతి కోసం ఇద్దరు ఉద్యోగులు బజారుకెక్కి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ పరువు తీశారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో పనిచేసే ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు నాగరాజు, రుద్రనాథ్‌ అదే కార్యాలయంలో పనిచేసే ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగినిపై మనసుపడ్డారు. అంతే కాకుండా ఆమె కోసం బాహాబాహీకి దిగారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారులవరకు వెళ్లడంతో విచారణ జరిపించి ముగ్గురిపైనా సస్పెన్షన్‌ వేటు వేశారు. దీంతో పరువు పోయిందని భావించి మనస్తాపానికి గురైన రుద్రనాథ్‌ సెల్ఫీ వీడియో తీసుకుని వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.

ఆ వీడియో చూసిన సహచరులు... సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా మంగళగిరి సమీపంలో అతడిని కనిపెట్టి కాపాడారు. డిపార్ట్మెంట్ దర్యాప్తులో పొరుగుసేవల ఉద్యోగినితో సాన్నిహిత్యం పెంచుకొని ఆ శాఖకు తలవంపులు తెచ్చేలా ఆ ఇద్దరు ప్రవర్తించినట్లు తేలింది. దీంతో డీపీఓలోని జూనియర్‌ అసిస్టెంట్‌లు జె.నాగరాజు, టి.రుద్రనాథ్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు తెలిపారు. వారిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.