బలాన్ని నిరూపించుకోండి... లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై కీలక ఆదేశాలు !

బలాన్ని నిరూపించుకోండి... లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై కీలక ఆదేశాలు  !

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నిఈ నెల 22న అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని ఈరోజు అదనపు బాద్యతలు చేపట్టిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. కాంగ్రెస్‌ పార్టీకి పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ ప్రభుత్వం మైనార్టీలో పడిందని విపక్షాలు గవర్నర్ ను కలిసి కోరాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగినంత సంఖ్యాబలం ఉన్నదా లేదా అన్నది సోమవారం నాటి బలపరీక్షతో తేలుతుందని తమిళిపై తెలిపారు. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న ఆమె, కిరణ్‌ భేడి స్థానంలో పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలను బుధవారం స్వీకరించారన్న సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వం మైనార్టీలో పడిందన్న ప్రతిపక్షాల ఆరోపణలను సీఎం నారాయణ స్వామి ఖండించారు. తమకు తగిన సంఖ్యాబలం ఉందన్న ఆయన బలపరీక్ష నెగ్గి తీరతామని అన్నారు. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలుండగా కాంగ్రెస్‌కు 15 మంది సభ్యులున్నారు. ముగ్గురు డీఎంకే, ఒక ఇండిపెండెంట్‌ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 14కు సమానమైంది. ప్రస్తుతం మెజార్టీ మార్క్‌ 15 కాగా, అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం లేదని ప్రతిపక్షాలు ఆరోపించడంతో బలపరీక్షకు తమిళిసై దీనికి సమ్మతించారు.