లిడియన్ నాదస్వరమ్.. చెన్నై టాక్ ఆఫ్ ద టౌన్

లిడియన్ నాదస్వరమ్.. చెన్నై టాక్ ఆఫ్ ద టౌన్

లిడియన్ నాదస్వరం ప్రస్తుతం చెన్నైలో టాక్ ఆఫ్ ద టౌన్. కేవలం 13 ఏళ్ల ఈ చెన్నై చిన్నోడు అమెరికన్ టాలెంట్ షో, ద వరల్డ్స్ బెస్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. పియానో మేధావిగా ప్రశంసలు అందుకుంటున్న లిడియన్.. రియాల్టీ షో ఫైనల్స్ లో రెండు క్లాసికల్ కంపోజిషన్స్- బీథోవెన్ ఫుర్ ఎలిస్, చాపిన్ ఎట్యుడ్ లను అలవోకగా ప్రదర్శించాడు.

ఈ వారం ప్రారంభంలో ఫైనల్స్ లో అదరగొట్టి టైటిల్ నెగ్గిన లిడియన్, చెన్నై చేరుకున్నాడు. వచ్చింది మొదలు సన్మాన సత్కారాలతో తలమునకలుగా ఉన్నాడు ఈ బాల సంగీత మేధావి. ఈ బాల పియానిస్ట్ ను సుప్రసిద్ధ సంగీత దర్శకుడు, మొజార్ట్ ఆఫ్ మద్రాస్ ఏఆర్ రెహమాన్ సత్కరించాడు. తన సొంత సంగీత పాఠశాల కెఎం మ్యూజిక్ కన్జర్వేటరీ (కెఎంఎంసి) 11వ వార్షికోత్సవం సందర్భంగా రెహమాన్ లిడియన్ ను సన్మానించాడు.

లిడియన్ అంతర్జాతీస్థాయిలో సాధించిన ఘనత గురించి మాట్లాడుతూ 'లిడియన్ విజయం భారత్ విజయం. ప్రపంచంలో ఎంతో ప్రతికూలత, అసహనం చూస్తున్న మన జీవితాల్లోకి ఇది ఒక ఆశ, ప్రేమ, సంతోషాన్ని తెచ్చింది. 11 ఏళ్ల క్రితం నాటిన కెఎంఎంసి అనే విత్తనం ఇంత పెద్దదై ఎందరికో స్ఫూర్తినిస్తుందని ఎవరికైనా తెలుసా? సంగీతానికి ఉన్న అత్యద్భుత శక్తి ఇదే' అని రెహమాన్ అన్నాడు.

కెఎంఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిమా రఫీఖ్ మాట్లాడుతూ 'లిడియన్ మొదటిసారి కెఎంకి వచ్చింది నాకింకా గుర్తుంది. అప్పుడు మా సాంస్కృతిక ఉత్సవం రంగ్రేజాలో అతను డ్రమ్స్ వాయించాడు. కెఎంలో చేరిన తర్వాత అతను పియానో నేర్చుకోవడం ప్రారంభించాడు. అప్పటి నుంచే అతను అంతర్జాతీయ వేదికలపై అద్భుతాలు చేస్తాడని స్పష్టంగా తెలిసింది. భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రతిభలు వెలుగు చూసేందుకు కెఎం వేదిక కానుందని ఆశిస్తున్నానని' చెప్పారు.