మడకశిర ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా..

మడకశిర ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా..

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈరన్న... అమరావతిలో అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఆయన రాజీనామా లేఖ అందజేశారు. కాగా, ఇటీవలే ఈరన్నను సుప్రీంకోర్టు అనర్హుడిగా తేల్చిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఈరన్న... వైసీపీ నుంచి తిప్పేస్వామి పోటీ చేయగా... తిప్పేస్వామిపై ఈరన్న విజయం సాధించారు. అయితే, ఈరన్న ఎన్నికల అఫిడవిట్‌లో తనపై కర్ణాటకలో నమోదైన క్రిమినల్ కేసులు, తన భార్య ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాన్ని ప్రస్తావించకపోవడంతో తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈరన్న ఎన్నిక చెల్లదని కోర్టు హియరింగ్‌లో తేల్చి.. తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేగా తిప్పేస్వామి కొనసాగాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈరన్న సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈరన్న ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించిన విషయం తెలిసిందే.