అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు వస్తావా?

అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు వస్తావా?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు సవాల్ విసిరారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్... ఎంత మంది తెలంగాణ అమరవీరులకు సాయం చేశావో అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు వస్తావా? అంటూ చాలెంజ్ చేశారు. టీఆర్ఎస్‌ది పగటి దొంగల ప్రజా నివేదిక సభ అంటూ ఎద్దేవా చేసిన ఆయన... టీఆర్ఎస్ తెలంగాణ రాబందుల పార్టీ అని కొత్త నిర్వచనం చెప్పారు. రెండు నెలలుగా... ప్రధానికి గులామ్ చేస్తున్నది నువ్వు కాదా? అని నిలదీసిన మధు యాష్కీ... తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టుపెట్టారని ఆరోపించారు. హైకోర్టు విభజనపై ఇస్తావా..! చస్తావా...! అని ఎందుకు ప్రధాని మోడీని అడగటం లేదని ప్రశ్నించిన యాష్కీ... 17 ఏండ్ల చరిత్ర ఉన్న మీ పార్టీకి ఆర్టీసీ బస్సులకు రూ. 4 కోట్లు ఇవ్వడానికి ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. జాతీయ రహదారికి గండి కొట్టే హక్కు నీకెక్కడిదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజకీయ అధికారం కావాలా... గులాబీ నేతకు గులామ్ కావాలో బీసీలు తేల్చుకోవాలని కోరారు మధుయాష్కీ... ప్రధాని మోడీకి గులామ్ అయిన సీఎం కేసీఆర్ పాలన అంతమైతేనే తెలంగాణ క్షేమంగా ఉంటుందన్నారు. ప్రగతి నివేదన సభలో కేటీఆర్ అధికార అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డ యాష్కీ... ఎన్నికలు ఎంత తొందరగా వస్తే... అంత మంచిది అని ప్రజలు చూస్తున్నారని... జోన్ల పేరుతో జోల కొడుతున్న మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని..? అని నిలదీశారు.