రైతుల రుణమాఫీ పత్రాలతో శివరాజ్ బంగ్లాకి కాంగ్రెస్ నేతలు

రైతుల రుణమాఫీ పత్రాలతో శివరాజ్ బంగ్లాకి కాంగ్రెస్ నేతలు

మధ్యప్రదేశ్ లో రైతుల రుణమాఫీపై రాజకీయం సాగుతోంది. నేతల ప్రకటనలు, విమర్శల మధ్య కాంగ్రెస్ మంగళవారం మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటికి వెళ్లి రుణాలు మాఫీ అయిన 21 లక్షల రైతుల జాబితాను అందజేసింది. 

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సురేష్ పచౌరీ నేతృత్వంలో పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఓపెన్ టాప్ జీపుల్లో రైతుల జాబితాలను నింపుకొని మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు. ఆయనకు 21 లక్షల రైతుల జాబితాను ఇచ్చింది. ఈ జాబితాలు జిల్లాలవారీగా ఉన్నాయి.

'రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన వాగ్దాన పత్రంలో రైతుల రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. కమల్ నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 21 లక్షల రైతుల రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఈ రైతుల జాబితా, పెన్ డ్రైవ్ లో కూడా వేసి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ కి అందజేయడం జరిగిందని' మాజీ కేంద్ర మంత్రి పచౌరీ తెలిపారు.

" 'జై జవాన్-జై కిసాన్ రుణ మాఫీ' పథకం కింద మొత్తం 55 లక్షల రైతుల రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ కావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ కి ముందు దాదాపు 21 లక్షల రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. వాళ్లకి రుణ మాఫీ పత్రాలు అందజేయడం జరిగింది. కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన రైతులకు కూడా మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందని' కాంగ్రెస్ స్పష్టం చేసింది. రైతు పక్షపాతిగా చెప్పుకొనే బీజేపీ నిరంతరం రుణ మాఫీపై అసత్యాలు వండివార్చి రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.