కమల్ నాథ్ కేబినెట్ లో డిగ్గీ రాజా కుమారుడు

కమల్ నాథ్ కేబినెట్ లో డిగ్గీ రాజా కుమారుడు

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కేబినెట్ ఏర్పాటైంది. ఈ మంత్రివర్గంలో మొత్తం 28 మంది మంత్రులు చేరారు. భోపాల్ లోని రాజ్ భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అందరు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మంత్రి మండలిలో అందరి కంటే యువ ఎమ్మెల్యే జయవర్ధన్ సింగ్ ని ఎంపిక చేయడం విశేషం. 32 ఏళ్ల జయవర్ధన్ సింగ్ ఎంపీ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమారుడు. ప్రస్తుత శాసనసభలో జయవర్ధన్ సింగ్ రాఘోగఢ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాఘోగఢ్ నుంచి జయవర్ధన్ సింగ్ వరుసగా రెండోసారి ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తేలగానే జయవర్ధన్ సింగ్ కి మంత్రి పదవి ఖాయమైంది. కమల్ నాథ్ తన మంత్రివర్గంలోకి తీసుకోబోయే సభ్యులకి ఏవైతే ప్రమాణాలు నిర్ణయించుకున్నారో వాటన్నిటికీ జయవర్ధన్ సింగ్ నూటికి నూరు పాళ్లు సరిపోతారు.

జయవర్ధన్ సింగ్ తండ్రి దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన బాటలోనే రాఘోగఢ్ రాజవంశ పరంపరను జయవర్ధన్ కొనసాగిస్తున్నారు. ఆరంభం నుంచి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో రాఘోగఢ్ రాజవంశం బలమైన ముద్ర వేసింది. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సొంతూరైన రాఘోగఢ్ ఎంతో చరిత్ర కలిగిన కోట. ఇప్పటికీ డిగ్గీ రాజీ కుటుంబం అక్కడ నివసిస్తోంది. కోట నిర్వహణ మొదలు దిగ్విజయ్ రాజకీయ, ధార్మిక వారసత్వాన్ని ఆయన కుమారుడు జయవర్ధన్ సింగ్ కొనసాగిస్తూ వస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ తండ్రి బలభద్ర సింగ్ మధ్యప్రదేశ్ మొదటి శాసనసభకు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఆయన తర్వాత 1977లో దిగ్విజయ్ సింగ్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2013లో జయవర్ధన్ సింగ్ అక్కడి నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు.