కరోనా కాలం..మంత్రికి మాస్కుల మాల.!

 కరోనా కాలం..మంత్రికి మాస్కుల మాల.!

సాధారణంగా ఎవరికైనా పూల మాలలతో సన్మానం చేస్తారు. డబ్బులు ఎక్కువైతే ఒక్కోసారి డబ్బులతో సైతం దండ చేసి మెడలో వేస్తారు. కానీ తాజాగా ఓ మంత్రికి మాస్కులతో చేసిన దండను వేశారు. దాంతో ఈ విషయం వైరల్ అయ్యింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోచోటు చేసుకుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో పరిస్థితులపై ఆరా తియ్యడానికి రాష్ట్ర మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ తొలిసారిగా గ్వాలియర్ పర్యటనకు వచ్చారు. కాగా అక్కడకు చేరుకున్న మంత్రికి బీజేపీ కార్యకర్తలు మాస్కులతో మాల వేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన అక్కడికి విచ్చేసిన ప్రజలకు మాస్క్‌లను, శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం దివంగత మాధవరావు సింధియా విగ్రహానికి పూలమాల వేశారు. ఇక కార్యక్రమానికి వచ్చిన కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థుల ఫీజుల విషయంలో ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న ఒత్తిడిపై మంత్రికి ఫిర్యాదు చేసారు. కరోనా తో అసలే చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయిందని స్కూలు ఫీజులు కట్టలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసారు. తల్లి తండ్రుల ఫిర్యాదు పై స్పందించిన మంత్రి ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.