కిల్లర్‌కు ఎస్ఐ వలపు వల...పెళ్లికూతురు గెటప్‌ లో ట్రాప్ 

కిల్లర్‌కు ఎస్ఐ వలపు వల...పెళ్లికూతురు గెటప్‌ లో ట్రాప్ 

 

ఇప్పటిదాకా సినిమాల్లో హీరో, హీరోయిన్లు దొంగలను పట్టుకోవడానికి రకరకాల వేషాలు వేసి వారిని పట్టుకోవడం కోసం పడే తంటాలు చూశాం. అయితే, నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మధ్యప్రదేశ్‌లో ఓ హంతకుడిని పట్టుకోవడానికి ఓ మహిళా పోలీస్ ఎస్ఐ ఏకంగా పెళ్లికూతురు గెటప్ వేసింది. మధ్యప్రదేశ్‌లో మాధవి అగ్నిహోత్రి అనే ఎస్ఐ  పెళ్లికూతురు గెటప్ వేసుకుని వెళ్లి నిందితుడిని పట్టుకుంది. బాలకృష్ణ చౌబే అనే 42 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ మీద మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో పలు కేసులు ఉన్నాయి. అందులో కొన్ని మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. పోలీసులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ అతడు మిస్ అయ్యేవాడు.

ఈ క్రమంలో ఎస్ఐ మాధవి అగ్నిహోత్రి కొంత మంది మధ్య వర్తుల ద్వారా తన పాత ఫోటోలను పంపిస్తూ బాలకృష్ణ చౌబేకి పెళ్లి ప్రపోజల్ పంపించింది. వారి ద్వారా నేరస్తుడు బాలకృష్ణ తో ఫోన్ లో మాట్లాడటం మొదలెట్టింది. క్రమేపీ అతడు తనవైపు ఆకర్షితుడయ్యేలా మాట్లాడింది. చివరికి పెళ్లి చేసుకుందామని చెప్పి ముహూర్తం ఫిక్స్ చేసింది. అందుకోసం  నౌగావ్  పోలీసు స్టేషన్  సరిహద్దు..ఉత్తరప్రదేశ్ లోని బిజోరి గ్రామంలోని ఓ గుడిలో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. తన టీంతో పాటు బిజోరి గ్రామంలో మఫ్టీలో మరికొంత మంది పోలీసులను ఏర్పాటు చేసుకున్నారు. బాలకృష్ణ చౌబే పెళ్లి చేసుకోవటానికి తయారై గుడికి చేరుకున్నాడు. అతడ్ని మాటల్లో దింపి అరెస్టు చేసింది మాధవి అగ్నిహోత్రి. నిశ్చేష్టుడైన బాలకృష్ణ తన తుపాకీతో ఆమె దాడి చేయటానికి యత్నించగా అప్పటికే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు.