మూవీ రివ్యూ : 'మహానటి'

మూవీ రివ్యూ : 'మహానటి'

నటీనటులు : కీర్తీ సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, భానుప్రియ, షాలినీ పాండే, 'జబర్దస్త్' మహేష్ తదితరులు  

ఛాయాగ్రహణం : డానీ శాంచెజ్ 

సంగీతం : మిక్కీ జే.మేయర్‌

నిర్మాణ సంస్థ : స్వప్న సినిమా

సమర్పణ : వైజయంతి మూవీస్   

నిర్మాత : ప్రియాంక దత్ 

దర్శకత్వం : నాగ అశ్విన్ 

విడుదల తేదీ : 09 మే 2018

తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన నటీమణుల్లో సావిత్రి ఒకరు. ఒక 'మాయాబజార్', ఒక 'మిస్సమ్మ', ఒక 'దేవదాసు'... ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె నటించిన ఆణిముత్యాలు ఎన్నో. నటనతో భారతీయ ప్రేక్షకులను అలరించిన సావిత్రి వ్యక్తిగత జీవితం గురించి పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సావిత్రి బయోపిక్ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు ఏర్పడ్డాయి. మరి, సినిమా ఎలా ఉంది? అంచనాలకు తగ్గట్టు ఉందా? లేదా? రివ్యూ చదవండి.   

సావిత్రి జీవితం తెరిచిన పుస్తకమని ప్రతి ఒక్కరూ భావిస్తారు. నటిగా ఆమె ఏంటనేది చేసిన సినిమాలు చెబుతాయి. వ్యక్తిగా, సాటి మనుషులను ఆదుకునే మహోన్నత మనిషిగా ఆమె ఏంటనేది చేసిన దానధర్మాలు చెబుతాయి. ఎలా మరణించారు? అనేది అందరికీ తెలిసిందే. మరి, సావిత్రి జీవితంలో ప్రేక్షకులు తెలుసుకోవడానికి ఏముంది? అనే ప్రశ్న వేసుకుంటే ఎంతో ఉందని సినిమా చూసిన ప్రేక్షకులకు తెలుస్తుంది. జననం నుంచి మరణం వరకు ప్రేక్షకులకు తెలియని వ్యక్తిగత జీవితం ఉంది. అదే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు నాగ అశ్విన్. 

కథ : 

ఆరేళ్ల వయసులో అమాయకత్వం, గడుసుతనం కలబోసిన అమ్మచాటు బిడ్డగా పెదనాన్న కెవి చౌదరి (రాజేంద్రప్రసాద్) ఇంట అడుగు పెడుతుంది చిన్నారి సావిత్రి. అక్కణ్ణుంచి నాటక రంగంలోకి ఎలా వచ్చింది? సినిమాల్లోకి ఎలా వచ్చింది? మహానటి సావిత్రిగా ఎలా ఎదిగింది? కథానాయికగా పేరు తెచ్చుకుంటున్న సమయంలో అప్పటికే పెళ్లయిన 'జెమిని' గణేషన్‌ని ఎందుకు పెళ్లి చేసుకుంది? అతడితో ఆమెకు ఎలా పరిచయం అయ్యింది? ప్రేమలో ఎలా పడింది? పెళ్లి తర్వాత నటిగా ఆమెకు వస్తున్న పేరు సంసారంలో ఎలాంటి చిక్కులు తెచ్చింది? మద్యానికి ఎలా బానిస అయ్యింది? చివరకు ఎలా మరణించింది? అనేది చిత్రకథ. సావిత్రి జననం నుంచి మరణం వరకు ఆమె వ్యక్తిగత జీవితంలో వివిధ దశలను చూపించే ప్రయత్నమే ఈ సినిమా. 

నటీనటుల పనితీరు : 

సావిత్రిగా నటించిన కీర్తీ సురేష్‌ని మహానటి అని చెప్పలేం. కాని మహానటి పాత్రలో మచ్చ లేని విధంగా నటించింది. అందం, అమాయకత్వం, ముఖ్యంగా సావిత్రి ఆహార్యం తదితర అంశాలను సరిగ్గా పట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో తేలిపోయింది. తమిళ నటుడు, సావిత్రి భర్త 'జెమిని' గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ జీవించాడు. తెలుగు ప్రేక్షకులకు అతను పెద్దగా తెలియదు. తమిళ సినిమాలు మనవాళ్లు చూసింది తక్కువ కాబట్టి 'జెమిని' గణేషన్ అచ్చంగా ఇలాగే ఉంటాడేమో అనేలా నటించాడు. విలేకరి మధురవాణి పాత్రలో సమంత కూడా జీవించింది. పతాక సన్నివేశంలో ఆమె నటన కంటతడి పెట్టిస్తుంది. విజయ్ ఆంటోని పాత్రలో విజయ్ దేవరకొండ తన పరిధి మేరకు నటించాడు. షాలినీ పాండే, రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. 

ప్రత్యేక అతిథి పాత్రల విషయానికి వస్తే ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు అలరించారు. అక్కినేని నాగేశ్వరరావుగా మరొకర్ని ఊహించుకోలేనంతగా  ఆయన మనవడు నాగచైతన్యను జీవించాడు. తెరపై చైతన్య కనిపించినంత సేపూ ఏయన్నార్ గుర్తుకు వస్తారంటే అతిశయోక్తి కాదు. చక్రపాణిగా ప్రకాష్ రాజ్, కేవీ రెడ్డిగా క్రిష్, ఎల్వీ ప్రసాద్ పాత్రలో అవసరాల శ్రీనివాస్, ఆయా పాత్రలకు హుందాతనాన్ని తీసుకొచ్చారు. 

సంగీతం - సాంకేతిక వర్గం : 

మిక్కీ జె మేయర్ స్వరపరిచిన పాటల్లో 'సదా నిన్ను...' మెలోడీ కొన్ని రోజుల పాటు వినిపిస్తుంది. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి సాహిత్యం టాప్ క్లాస్ అంతే. చిత్రీకరణ పరంగానూ ఆకట్టుకుంటుంది. 'మూగమనసులు..' పాట బావుంది. 'మహానటి' పాటను ఈతరం సంగీత శైలిలో స్వరపరచడం వల్ల కథలో అతకనట్టు అనిపిస్తుంది. కథానుసారంగా పాత పాటల్లో కొన్నిటిని నేపథ్య సంగీతంగా ఉపయోగించారు. సాంకేతిక నిపుణుల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది ముగ్గురి గురించి. మొదటి వ్యక్తి సినిమాటోగ్రాఫర్ డానీ. రెండో వ్యక్తి స్టైలిస్ట్ ఇంద్రాక్షి పాఠక్. మూడో వ్యక్తి కళా దర్శకత్వ విభాగానికి నేతృత్వం వహించిన తోట తరణి. బ్లాక్ అండ్ వైట్, సినిమా స్కోప్, కలర్... సన్నివేశాన్ని బట్టి సినిమాటోగ్రఫీ మారుతుంది. కాని ఎక్కడా ప్రేక్షకుల కంటికి ఇబ్బందిగా అనిపించదు సరికదా... సన్నివేశంలో లీనమయ్యేలా సినిమాను చిత్రీకరించాడు డానీ. ఇక, అప్పటి రోజులను ప్రతిభించించేలా ఇంద్రాక్షి పాఠక్ దుస్తులు డిజైన్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ప్రొడక్షన్ డిజైన్ శివంలతో కలిసి తోట తరణి వేయించిన సెట్స్ పేరు పెట్టడానికి లేనివిధంగా వున్నాయి. ఖర్చుకి వెనుకాడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో ప్రియాంక దత్ సినిమాను నిర్మించారు. సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగుల్లో చాలావరకూ గుండెలను సూటిగా తగులుతాయి. 

దర్శకత్వం : 

కథకుడిగా కంటే దర్శకుడిగా నాగఅశ్విన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే... బెంగళూరులోని సావిత్రి కోమాలోకి వెళ్లిన సన్నివేశం గానీ... షూటింగులో రెండంటే రెండే కన్నీటి బొట్లు వచ్చిన సన్నివేశం గానీ... ఇలా సినిమాలో చూపించిన సన్నివేశాల్లో ఎక్కువశాతం ప్రచారంలో ఉన్నవే. ఆయా సన్నివేశాల మధ్య సావిత్రి వ్యక్తిగత జీవితాన్ని స్పృశిస్తూ నాగఅశ్విన్ కథను అల్లిన విధానం బావుంది. అలాగే, 24 శాఖల నుంచి చక్కటి ప్రతిభ రాబట్టుకున్నాడు. కానీ, దర్శకుడిగా కొన్నిచోట్ల విఫలం అయ్యాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలను మరింత బాగా తీసి ఉండాల్సింది. భర్తపై సావిత్రి కోపం తెచ్చుకున్న సన్నివేశంలో, మద్యానికి బానిసైన విధానాన్ని చూపించడంలో డెప్త్ అంతగా లేదు. ప్రేక్షకుల మనసుల్లో తడిని బయటకు తీయవలసిన సన్నివేశాలను సాదాసీదాగా తీశాడు. ఎక్కువ లోతులకు వెళ్లలేదు. ఓవరాల్‌గా బాగా తీశాడు. 

విశ్లేషణ :

ఈతరం ప్రేక్షకులకు, యువతకు సావిత్రి గురించి ఎక్కువ తెలియదు కాబట్టి దీన్నో ఫిక్షనల్ బయోపిక్‌గా చూస్తే నచ్చుతుంది. ఓ తరం ముందుకు వెళితే... ప్రస్తుతం నలభై, యాభై ఏళ్ల వయసులో వున్నవారికి సావిత్రి గురించి కొంచెం తెలుసు. ఆమె సినిమాల్లో కొన్నిటిని తప్పకుండా చూసి ఉంటారు. రెండు తారలు ముందుకు వెళితే... సావిత్రి నటించిన ప్రతి సినిమా వాళ్లకు పరిచయమే. సో... కీర్తీ సురేష్ నటన వాళ్లకు నచ్చకపోయే అవకాశాలు ఎక్కువ. ఇక, కథ విషయానికి వస్తే... అసలు కథలో పిట్టకథ (సమంత-విజయ్ దేవరకొండల ప్రేమకథ) మంచి భోజనం చేస్తున్నప్పుడు పంటికింద రాయిలా తగులుతుంది. ఆ కథ లేకుండా నేరుగా సావిత్రి జీవితంపై దృష్టి సారిస్తే ఆమె జీవితంలో మరిన్ని ముఖ్యఘట్టాలను ప్రేక్షకులకు చూపించే అవకాశం దర్శకుడికి దక్కేది. ప్రస్తుతం తీసిన సినిమాలో సావిత్రి జీవితాన్ని చూస్తే... మంచి చెడు రెండిటినీ చూపించారు. అయితే... సావిత్రి మరణం తరవాత ఆమె పిల్లలను 'జెమిని' గణేషన్ దగ్గరకు తీసుకున్నాడా? లేదా? అనే విషయాలను వదిలేశారు. తల్లి మరణం తరవాత తండ్రితో పిల్లలకు ఎలాంటి సంబంధం ఉందో చూపలేదు. 'జెమిని' గణేషన్ మొదటి భార్య స్పందనతో సహా. సావిత్రి జీవితంగా కాకుండా ఓ మహిళ కథగా, మహానటి గాధగా చూస్తే సినిమా నచ్చుతుంది. అలా కాకుండా మహానటి వ్యక్తిగత జీవితంలో ఎక్కువ తొంగి చూడాలని వెళితే కాస్త నిరాశ తప్పదు. దర్శకుడు పైపైన మాత్రమే స్పృశించాడు.