మహానటికి మహా సత్కారం

మహానటికి మహా సత్కారం

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మహానటి సినిమా ఎలాంటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  అలనాటి ఉద్దండ నటులైన ఎన్టీఆర్, ఎస్వీఆర్ కు ధీటుగా సావిత్రి సినిమాల్లో నటించింది. సావిత్రి జీవిత చరిత్రను సినిమాగా చేయాలని చాలామంది అనుకున్న..కుదరలేదు.  నాగ్ అశ్విన్ ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు.  మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయింది.  అచ్చంగా సావిత్రిని తలపించింది.  మహానటి సినిమా మంచి విజయం సాధించింది.  మహానటి టీమ్ ను అనేక సంస్థలు ఘనంగా సన్మానించాయి.  ఇప్పుడు ఈ టీమ్ తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సందడి చేసింది.  మహిళా విశ్వవిద్యాలయం మహానటి టీమ్ కు ఘన సన్మానం చేసింది.  మహానటి సినిమాలోని తన నటనకు ఈ స్థాయిలో స్పందన వస్తుందని అసలు ఊహించలేదని, ఇది సమిష్టి విజయం అని కీర్తి సురేష్ పేర్కొన్నది.  

ప్రపంచంలోనే అద్భుతమైన నటి సావిత్రి అని, అలాంటి మహానటిని మరలా చూడము, చూడలేమని నటుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఫ్యాక్షన్, హర్రర్ వంటి సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో మహానటి లాంటి అద్భుతమైన సినిమా రావడం సంతోషించదగ్గ విషయం అని రాజేంద్రప్రసాద్ అన్నారు.  మహానటిలో కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు రాజేంద్రప్రసాద్.