రేపే పోలింగ్.. మహారాష్ట్ర, హర్యానాలో ఏర్పాట్లు పూర్తి..

రేపే పోలింగ్.. మహారాష్ట్ర, హర్యానాలో ఏర్పాట్లు పూర్తి..

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మహారాష్ట్ర, హర్యానా సిద్ధమయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉంది. పీఠాన్ని పదిల పర్చుకోవడానికి కాషాయ శిబిరం, తిరిగి సత్తా చాటేందుకు కాంగ్రెస్‌ హోరాహోరీగా ప్రచారం చేశాయి.. ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఎదుర్కొంటున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు మహారాష్ట్ర, హర్యానా. ఇక, జమ్మూకశ్మీర్‌ విషయంలో కీలక నిర్ణయాలు.. అయోధ్యపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో దేశంలో ఒక విధమైన రాజకీయ వేడి వాతావరణం నెలకొంది. 

సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనతో మహారాష్ట్రలో రాజకీక కాక రేపింది బీజేపీ. గతంలో ఒంటరిగా బరిలో దిగిని కమలనాథులు.. ఈసారి శివసేనతో కలిసి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు గెలిస్తే.. శివసేన 63 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్‌కు 42, ఎన్‌సీపీకి 41 స్థానాలు వచ్చాయి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. 8.9 కోట్ల మంది ఓటర్లున్నారు. బాల్‌థాక్రే కుటుంబం తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచింది. ఉద్దవ్‌థాక్రే కుమారుడు ఆదిత్యథాక్రే స్వయంగా అసెంబ్లీ బరిలో నిలిచారు. అదీ కాకుండా ఎన్నికల సమయంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌పై ఈడీ కేసు నమోదైంది. ఈ అంశం కూడా మహారాష్ట్ర ఎన్నికలను వేడెక్కించింది. 

ఇక హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి.. గత ఎన్నికల్లో 47 స్థానాలు గెలుపొందిన బీజేపీ మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోసారి హర్యానా పీఠంపై పాగా వేయాలన్నది కాషాయ శిబిరం ఆలోచన. అందుకు అనుగుణంగానే ప్రచారం నిర్వహించింది బీజేపీ. మిషన్‌ 75 ప్లస్‌ పేరుతో క్యాంపైన్‌ చేపట్టింది. కాంగ్రెస్‌, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1.82 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఈ నెల 24న చేపడతారు. ఇటు పోలింగ్‌, అటు కౌంటింగ్‌కు సంబంధించి  పకడ్బంధీగా ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం.