మహారాష్ట్రలో కాంగ్రెస్ చిత్తు

మహారాష్ట్రలో కాంగ్రెస్ చిత్తు

మహారాష్ట్రలో ఎన్నికల ముఖచిత్రం తేటతెల్లమైంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో వార్ వన్ సైడ్ గా మారింది. రాష్ట్రంలో కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ముఖాముఖి పోటీలో అధికార బీజేపీ-శివసేనల జోడీ యుపిఏ కూటమిని చిత్తు చేసింది. గత ఎన్నికల్లో మాదిరిగానే రాష్ట్రంలోని 48 లోక్ సభ స్థానాలకు 23 బీజేపీ, 18 శివసేన గెలిచే దిశగా సాగుతున్నాయి.  కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి కేవలం 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ దిగ్గజం అశోక్ చవాన్ సైతం పరాజయం దిశగా సాగుతున్నారు. కొన్నేళ్లుగా మరాఠా యోధుడు శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా వస్తున్న బారామతిలో ఆయన కుమార్తె సుప్రియా సూలే వెనుకంజలో ఉన్నారు. 

ఉత్తరప్రదేశ్ తర్వాత ఎన్నికల ఫలితాలలో అత్యంత కీలకమైన మహారాష్ట్ర నుంచి 48 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 6 దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ 23 సీట్లు, భాగస్వామ్య పక్షం శివసేన 18 స్థానాలు గెలుపొందాయి. ఇతర పార్టీలు ఏడు సీట్లు దక్కాయి. రైతుల సమస్యలు, కరువులతో నిత్యం సతమతమయ్యే మహారాష్ట్రలో రైతులు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని అంచనాలు వెలువడ్డాయి. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే ప్రచారం కూడా ఎన్డీఏని దెబ్బ తీయవచ్చని భావించారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ-సేన కూటమి మ్యాజిక్ మరోసారి పనిచేయనుందని చెప్పాయి. అదే నిజం చేస్తూ మహారాష్ట్రలో ఈ జోడీ ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమిని చావుదెబ్బ తీసింది.