రివ్యూ: మహర్షి

రివ్యూ: మహర్షి

నటీనటులు: మహేష్ బాబు, పూజాహెగ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు, రావు రమేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, వెన్నెల కిషోర్ తదితరులు 

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 

సినిమాటోగ్రఫీ: కేయు మోహనన్ 

నిర్మాతలు: దిల్ రాజు, సి అశ్వినీదత్, పివిపి సినిమా 

దర్శకత్వం: వంశి పైడిపల్లి 

 

స్టార్ హీరోల సినిమా అంటే భారీగా ఉండాలి.. స్క్రీన్ ప్రజెంటేషన్ రిచ్ గా ఉండాలి.  లొకేషన్స్ అందంగా ఉండాలి.  భారీ ఫైట్స్ ఉండాలి.. దాంతోపాటు సామాజిక అంశం అంతర్గంతంగా ఉండాలి అలా ఉంటేనే సినిమా హిట్టవుతుంది.  సినిమాకు పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి.  సామాజిక అంశాలను తన సినిమాలో చూపిస్తూ శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల ద్వారా హిట్ కొట్టాడు మహేష్ బాబు.  ఇప్పుడు అదే కోవలో మహేష్ వచ్చింది.  మహేష్ 25 వ సినిమాగా వచ్చిన మహర్షి ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దామా.  

కథ: 

లైఫ్ లో ఓడిపోవడం అంటే ఏంటో తెలియని సీఈవో మహేష్.  జీవితంలో ఎదగడానికి ఎన్నో కష్టాలు పడతాడు.  లక్ష్యాన్ని చేరుకుంటాడు.  ఇంతగా కష్టపడటానికి కారణం తాను వచ్చిన నేపధ్యం.  మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అలాగే మధ్యతరగతి వ్యక్తిలా ఉండటం ఇష్టంలేక ఉన్నత లక్ష్యాలను పెట్టుకుంటారు.. వాటిని సాధించుకుంటాడు.  ఇలా  ఎదిగే క్రమంలో తనకు తన స్నేహితులైన అల్లరి నరేష్, పూజా హెగ్డేలు సహకరిస్తారు.  కొన్ని త్యాగాలు చేస్తారు.  ఆ స్నేహితుల కోసం మహేష్ ఏం చేశాడు...? విజయం అంటే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదని, తన స్థాయిని పెంచుకోవడం అని తెలుసుకున్న మహేష్ అసలైన లక్ష్యం ఏంటి ? ఆ లక్ష్యాన్ని సాధించి మహర్షి ఎలా అయ్యాడు అన్నది కథ. 

విశ్లేషణ: 

మహేష్ 25 వ సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  మైలు రాయిగా నిలవాల్సిన సినిమా కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.  ఎలాంటి అంశాలు ఉంటె ప్రేక్షకులకు నచ్చుతాయో ఎంచుకొని వాటిని కథలో భాగం చేశారు.  మహేష్ ను తెరపై ప్రజెంట్ చేసిన తీరు అందరికి నచ్చుతుంది.  ముఖ్యంగా బిజినెస్ మెన్ గా మహేష్ అభినయం అద్భుతం.  విద్యార్థిగా మహేష్ చేసిన అల్లరి అంతాఇంతా కాదు.  సరదాగా ఉంటూనే విద్యావ్యవస్థ విధానంను మహేష్ ప్రశ్నించిన తీరు అందరికి నచ్చుతుంది అనడంలో సందేహం లేదు.  కాలేజీ వాతావరణం, మహేష్, అల్లరి నరేష్, పూజా హెగ్డే ల మధ్య స్నేహం.. వీటిని చూస్తుంటే మనకు అమీర్ ఖాన్ త్రీ ఇడియట్స్ సినిమా గుర్తొస్తుంది.  ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఎమోషన్ సీన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.  

సెకండ్ హాఫ్ పూర్తిగా రైతు సమస్యల చుట్టూ తిరుగుతుంది.  కార్పొరేట్ దందాలో భూములను పోగొట్టుకున్న రైతుల కోసం మహేష్ చేసిన పోరాటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.  సెకండ్ హాఫ్ కొంత నిడివి ఎక్కువగా ఉన్నది.  కొద్దిగా తగ్గించి ఉంటె సినిమా ఇంకా బాగుండేది.  పైగా అల్లరి నరేష్.. మహేష్ బాబుల మధ్య వచ్చే సన్నివేశాలు ఇంకొన్ని యాడ్ చేసుంటే సినిమా ఇంకా మెరుగ్గా ఉండేది.  భారీ తనం లేకుండా క్లైమాక్స్ ను ఎమోషన్స్ తో ముగించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది.  

నటీనటుల పనితీరు: 

మహేష్ తనలోని వైవిధ్యాన్ని ప్రదర్శించే అవకాశం వచ్చింది.  మూడు వేరియేషన్స్ లో మహేష్ చక్కగా నటించి మెప్పించాడు.  గమ్యం సినిమా తరువాత అల్లరి నరేష్ కు మంచి పాత్ర దక్కిన సినిమా మహర్షి అని చెప్పొచ్చు.  నరేష్ వలన సినిమా గమనం మారుతుంది.  మహర్షి అసలైన లక్ష్యం వైపు అడుగులు పడతాయి.  పూజ హెగ్డే కు కూడా మంచి పాత్ర లభించింది.  కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితం కాకుండా కథలో భాగం అవుతూ క్యారెక్టర్ ఉంటుంది.  విలన్ పాత్రలో జగపతిబాబు మరోమారు మెప్పించాడు.  విలన్ గా జగపతిబాబు ఎంట్రీ సూపర్.  

సాంకేతిక వర్గం పనితీరు: 

సినిమాకు కథే బలం.  కథలో బలం లేకుండా ఎంత స్క్రీన్ ప్లే రాసుకున్నా దానివలన పెద్దగా ఉపయోగం ఉండదు.  వంశి పైడిపల్లి కథను బలంగా తయారు చేసుకున్నాడు.  కమెర్షియల్ ఫార్మాట్ ఉంటూనే... సున్నితమైన సామాజిక అంశాన్ని జొప్పించి మెప్పించాడు.  డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా రాసుకోవడం విశేషం. దేవిశ్రీ అందించిన సంగీతం బాగుంది.  బయట వినడానికి ఆల్బమ్ లో పెద్దగా విషయం లేదు అనుకున్నా...థియేటర్ కు వెళ్లి చూస్తే సూపర్బ్ గా అనిపిస్తుంది.  సినిమాను స్టైలిష్ గా, రిచ్ గా తీర్చి దిద్దారు నిర్మాతలు.  కేయూ మోహనన్ ఫోటోగ్రఫి సినిమాకు అదనపు బలం.  

పాజిటివ్ పాయింట్స్: 

కథ 

నటీనటులు 

డైలాగ్స్ 

ఫోటోగ్రఫి 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 

మైనస్ పాయింట్స్: 

ఎక్కువ నిడివి 

చివరిగా: మహర్షి : సమ్మర్ స్పెషల్ జర్నీ