రాజమౌళి కంటే ముందే గూరూజీతో ‘అతడు’!

రాజమౌళి కంటే ముందే గూరూజీతో ‘అతడు’!

‘అతడు, ఖలేజా’... ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ పర్ఫామెన్స్, కలెక్షన్లతో కాకుండా... త్రివిక్రమ్, మహేశ్ కాంబినేషన్ వల్లే ఎప్పుడూ చర్చలో ఉంటాయి. మాటల మాంత్రికుడితో మన ‘రాజకుమారుడు’ కలసి పని చేసిన రెండు సార్లు, ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేని సినిమాలు వచ్చాయి. అందుకే, మరోసారి ఈ ఇద్దరూ సినిమా చేయాలని అభిమానులు ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. ఆ కోరిక తీరే సమయం ఎట్టకేలకు వచ్చినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం మహేశ్ ‘సర్కారు వారి పాట’ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. అటు త్రివిక్రమ్ కూడా ఏప్రెల్ నుంచీ ఎన్టీఆర్ తో సినిమాకి రెడీ అవుతున్నాడు. తారక్, త్రివిక్రమ్ సినిమా 2022 ప్రథమార్థంలో జనం ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే, అప్పటి వరకూ మహేశ్ కూడా ‘సర్కారు వారి పాట’ కంప్లీట్ చేసి ఫ్రీ అవుతాడు. అందుకే, 2022లో ‘అతడు’ కాంబినేషన్ రిపీట్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్! మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా తరువాత రాజమౌళి ఫిల్మ్ చేస్తాడని చాలా మంది చెబుతున్నారు. కానీ, ‘ఆర్ఆర్ఆర్’ తరువాత దర్శక ‘బాహుబలి’ లాంగ్ గ్యాప్ తీసుకుంటాడని మరో టాక్ వినిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత జక్కన్న తీసుకునే విరామంలో త్రివిక్రమ్, మహేశ్ సినిమా పూర్తవుతుందని తాజా సమాచారం. చూడాలి, గురూజీ, ‘మహర్షి’ కాంబినేషన్ ఎంత త్వరగా మన ముందుకు వస్తుందో మరి!